
హైదరాబాద్, జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ): ప్రస్తుత పోటీయుగంలో విజయాన్ని సాధించాలంటే మాతృభాషతో పాటు ఇంగ్లీష్ భాషపై కూడా పూర్తి ప్రావీణ్యం అవసరమని జూనియర్ సివిల్ జడ్జి అరీష నుస్రత్ పేర్కొన్నారు. శనివారం మలక్‌పేటలోని డాన్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన విద్యార్థినుల సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. బాలుర కంటే బాలికలు ఎక్కువగా పట్టుదలతో చదువుల్లో మెరుగ్గా ప్రదర్శిస్తున్నారు. నేను ఢిల్లీకి చెందినప్పటికినీ తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షకు తెలుగు భాషలో ఉత్తీర్ణత కావడం అనివార్యమవడంతో పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యాను. భాష ఎప్పుడూ అడ్డు కాదు. కష్టపడి ప్రయత్నిస్తే ఏమైనా సాధ్యం.’’ అని చెప్పారు.

‘‘విద్యార్థులు చిన్ననాటి నుంచే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. మొబైల్ ఫోన్లు కాదు… పత్రికలు, సాంకేతిక పుస్తకాలు చదవాలి. ఇస్రో, నాసా వంటి సంస్థల పరిశోధనలు తెలుసుకోవాలి. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి’’ అని సూచించారు. పేదరికం పోటీ పరీక్షలకు అడ్డుకాదని స్పష్టం చేశారు. అమ్మాయిలను తక్కువ అంచనా వేయకుండా తల్లిదండ్రులు పురాతన అపోహలు విడిచి, వారి కలలను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాన్ విద్యాసంస్థల చైర్మన్ ఫజల్ ఉర్ రెహమాన్ ఖుర్రం, షజియుల్లా ఫిరాసత్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.