నడిపించలేని నాయకత్వ లేమి ? – ఇదీ!’బిసి రిజర్వేషన్ సాధన’ సామి!
“భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వద్దామ,కర్ణులున్ననేమి నాయకత్వ లేమి మనసు కుంగదీయును”అని శల్య పర్వంలో తిక్కన అంటాడు. అదే మహాభారతంలో “లేలేమ్ము రణంబులో బలిమి చూపుము”అన్నాడు హరివంశం ఉత్తరభాగంలో ఎఱ్ఱన మహాకవి.
సరిగ్గాపై రెండు మహితోక్తులు ప్రస్తుతం 42% బీసీరిజర్వేషన్ సాధనకై పోరాడుతున్న నాయకులకు వర్తిస్తుంది.బీసీల్లో శతమునకు మించి కులాలు ఉండడమో, ఎక్కువగా సంఘాలు నాయకులు కలిగివుండడమో కానీ బీసీ రిజర్వేషన్ సాధనకు ధైర్యంగా ముందుకు రావడం లేదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.సామాజిక రాజకీయ రంగాలలో వెనుకబడిన వారని పేరుకు తగినట్లుగానే 42%రిజర్వేషన్ పొందడానికి ఉద్యమం కూడా వెనుకబడినట్లుగానే ఉన్నది.ఎందుకంటే, ‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు’అన్నట్లుగా ఆయా కులాల్లో నాయకులు తామర తంపరగా ఉండడం ఒక కారణం కావచ్చు.రెండోది రాజ్యాంగం గురించి తెలియకపోవడం, తెలిసిన ఇంతలెక్చువల్ నాయకులు వివరిస్తే వారి మాట వినకపోవడం,మూడోది ఉద్యమ నేపథ్యం ఉన్న ఎస్సీ నాయకులు విశారదన్ మహా రాజ్ మందకృష్ణ,జేబీరాజు, చెన్నయ్య తదితరులు చెబితే ఎస్సీల మాటలు మనమింటామా అనుకోవడం, నాలుగోది’ఎవరికి వారే యమునాతీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తూ మీడియా ముందుకు వచ్చి ఎవరిష్టమొచ్చినట్లుగా అర్థంపర్థం లేకుండా మాట్లాడడం చూస్తే నవ్వొస్తుంది. ఒక బీసీ నాయకుడైతే ఏకంగా కోర్టులో 42%బీసీ రిజర్వేషన్స్ పై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన మాధవరెడ్డిని ‘నువ్వు మంచి వ్యక్తివి నా మాటవిను కేసు వెనక్కు తీసుకో’అని అడుక్కోవడం చూస్తే వీళ్ళ బీసీ రిజర్వేషన్ సాధిస్తారా? అనే విషయం ద్యోతకమవుతుంది.ఇంకొక బీసీ నేత ఒకడుగు ముందుకేసి,టీవీ చర్చలో, మీరు అగ్రవర్ణాలవారు బీసీలకు ఇంత అన్యాయం చేస్తారా? ఇది న్యాయమా మా ఉసురు మీకు తప్పక తగులుతుందంటూ శాపనార్దాలు పెట్టడం చూస్తుంటే ఒకింత జాలేస్తుంది. రాజ్యాంగం దాని అనుసారంగా చట్టాల గురించి తెలుసుకోకుండా రిజర్వేషన్ సాధించే దారిని వదిలేసి వ్యక్తిగత దాడులు చేయడానికి వెనుకాడమంటూఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతుండడం చూస్తుంటే వింటుంటే మతిపోతుంది.
ఒకే ఒక్కడు సినిమాలో, జర్నలిస్ట్ అర్జున్ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సిఎం రఘువరణ్ స్థితి చూసి బయట అతని అనుచరులు ఆ టీవీ ఛానల్ పై దాడి చేసినట్టుగా ప్రస్తుతం బీసీ నాయకులపరిస్థితి కన్పిస్తున్నది. ‘కాలు విడిచి కానుగు వేరు పట్టుకున్న’ నక్క సామెతను గుర్తుకు తెస్తున్నారు. మరొక బీసీ నాయకులు ఇంకాస్త ముందుకు వెళ్లి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 42%బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ సిఎం చేత ధర్నాచేయించామంటూ కాంగ్రెస్ ప్రభుత్వవిధేయతను ప్రకటించుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు అవాకులు చెవాకులు పేలుతు నోటి దురుసును ప్రవర్తిస్తున్నారు. తప్ప అసలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు,బీసీ ఎమ్మెల్యేలు పార్టీని విడిచి బైటికి వచ్చి బాహాటంగా బీసీ రిజర్వేషన్ సాధనకు మద్దతు పలుకలేక ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి బీసీలకు మద్దతు తెలిపిందని కుంటి సాకులు చెబుతూ బానిసత్వాన్ని ప్రదర్శిస్తూ, చేతగానితనానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ ఎస్ పార్టీకి చెందిన ప్రస్తుతం ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్న బీసీ నాయకులైతే అసలు పార్టీ అధినాయకునికి చెప్పలేక కెసిఆర్ దర్శనానికే నోచుకోకపోతున్నారు, పాపం బీసీ నాయకులు కక్కలేక మింగలేక బిక్కచస్తున్నారు. ఇక కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీ ఎమ్మెల్సీలు తమ పార్టీ బీసీ రిజర్వేషన్స్ కు వ్యతిరేకం కాదంటూనే రాష్ట్రంలోని బీజేపీ పార్టీకి అధ్యక్షులుగా బీసీని మాత్రం చేయరు గానీ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సిఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించండంటూ కాంగ్రెస్ పార్టీని బృహన్నలలా కోరుతారు. అసలు మండల్ కమిషన్ ని వీపి సింగ్ అమలు చేస్తే అడ్డుకుని అప్పట్లో వీపి సింగ్ ప్రభుత్వాన్ని ఆర్ధాoతరంగా కూల్చి కాశ్మి్ర్ నుంచీ కన్యాకుమారి వరకు తద్విరుద్దంగా ఎల్కె అద్వానీ కమండల్ ఉద్యమం బీసీలకు ద్రోహం చేసిన విషయం మరిచినట్టున్నారు. ఇట్లా అన్ని పార్టీల నాయకులు బీసీ రిజర్వేషన్ లపై స్వతసిద్ధంగా మాట్లాడలేకపోతూ, స్వజాతి నిర్మాణానికి నడుం కట్టి ముందుకు సాగలేక ధర్మాన్ని కాలరాస్తున్నారు.
బీసీలోని అన్ని కులాల నాయకులుసమస్య ఒక్కటైనా కూడా సమైక్యం కాలేకపోతున్నారు. బీసీ కులాల్లో ఉన్న రజనీతిజ్నులు, మేధావులను పక్కన పెట్టడం మూలంగా బీసీ 42% రిజర్వేషన్ సాధన సమస్య మరింత జఠిలమవుతున్నదే తప్ప సమస్య పరిష్కారం దిశగా పయనించడం లేదు.పార్టీల జండాలు విడనాడి 42%బీసీ రిజర్వేషన్స్ నాడిని పట్టుకుని ఉద్యమబాటను పట్టాలి. ఉత్తర్ ప్రదేశ్ లో కాన్షిరాం మాదిరిగా అంబేద్కర్ ఆలోచనలు పుణికిపుచ్చుకున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలసి జట్టుకట్టి పోరాటం చేయాల్సిన తరుణం ఇదేనని తెలుసుకోవాలి.ఒకవైపు కోర్టులో పోరాడుతూ రాజ్యాంగం తెలిసిన రాజ్యాంగకర్తల, విద్యావంతులైన బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీల సహకారంతో పోరాటాలు చేస్తూ వివిధ పార్టీలకు బీసీలంతా సహాయ నిరాకరణంతో, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడే పార్టీల కతీతంగా బీసీ లు సంఘటితమై శాసనసభ ద్వారా పార్లమెంటులో 42%బీసీ రిజర్వేషన్స్ బిల్లు ఆమోదింపబడి రాజ్యాంగం సవరణ చేసి 9వ షెడ్యూలులో చేర్చినప్పుడే రిజర్వేషన్స్ సాధింపబడినట్టుగా భావించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ యిస్తామంటున్నా కాంగ్రెస్ పార్టీ మాటలు, రిజర్వేషన్స్ కు కేంద్రంలోని తాము వ్యతిరేకం కాదని వెనక్కు లాగేసే బీజేపీ ప్రభుత్వం మాటలను నమ్మని నాయకుడు బీసీలకు ప్రస్తుతం అవసరం.అలాంటి స్ఫురద్రూపి, నయవంచక పార్టీల మోసపూరిత మాటలు నమ్మని, సుడి గుండంలో చిక్కుకున్న 42%బీసీ రిజర్వేషన్స్ నావను సమర్థవంతంగా నడిపే బీసీ నాయకుడు జాతిమత విభేదాలులేని నావికుడైనప్పుడే బీసీల రిజర్వేషన్ సాధ్యమవుతుంది. లేకపోతే ఆయా అగ్రవర్ణాల పార్టీలకు ఊడిగం చేస్తూ చిన్న చిన్న పదవులకు ఆశపడుతూ రాజ్యాధికారం మరచిన శాశ్వత బానిసలుగా బీసీ లు మిగిలిపోవాల్సిందే!ఈ సత్యం తెలుసుకుని బీసీల్లోని అన్ని కులాలు ఒకే గొడుగుకిందకి వచ్చి ఒకని నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇకనైనా గ్రహించినప్పుడే మేలు జరుగుతుంది.