హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) : సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమర యోధులు బాబూ జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి దళిత వర్గాలకు అందించారని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ బషీర్ బాగ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాత్ముల జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖా మాత్యులు, జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారక వేదిక నుంచి ఆయన బడుగుల అభివృద్ధి కోసం జగ్జీవన్ రామ్ సేవలపై ప్రసంగించారు. వివిద కుల సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలో జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. శివకుమార్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సి. సత్యనారాయణ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వర్కాల సత్యనారాయణ, ఎడ్యుకేషనలిస్ట్ జె. రామ రాజు తదితరులు పాల్గొన్నారు.
