తిరుమల, జనవరి 5, (ఇయ్యాల తెలంగాణ) : తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ అధికారులు అన్ని రకాల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వదర్శనంతో పాటు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి, వీఐపీలకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారు. శనివారం ఒక్కరోజే వైకుంఠ ద్వారం ద్వారా 88,662 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. హుండీ ద్వారా భారీగా ఆదాయం వచ్చిందని, రూ.5.05 కోట్లు సమకూరిందని అధికారులు తెలిపారు. అలాగే, 24,417 మంది భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించారు. ఆదివారం సాయంత్రం నాటికి కూడా 50 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు.భక్తుల సౌకర్యార్థం, టీటీడీ అధికారులు రద్దీని అంచనా వేస్తూ, అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులకు కూడా త్వరగా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి, వీఐపీ దర్శనాలకు పరిమిత సంఖ్యలో భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ంఎ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా, సర్వదర్శనం చేసుకునే భక్తులకు కూడా దర్శన సమయాన్ని తగ్గించగలిగారు. క్యూలైన్‌లో ప్రవేశించిన 12 గంటల్లోపే దర్శనం కల్పించడం అనేది భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది.
ఈ నెల 8వ తేదీ వరకు ఇదే పద్ధతిలో భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడానికి అధికారులు సమష్టిగా కృషి చేస్తున్నారని అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు.తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లను స్వామివారిపై మూడుసార్లు విసిరి వేసారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు.అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.ప్రణయ కలహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. మరోవైపు ఆరో రోజు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ‘ముఖ్యంగా ఐదోరోజు శనివారం అత్యధికంగా దాదాపు 89 వేల మందికి దర్శనం కల్పించాము. ఇందులో సర్వ దర్శనానికి విచ్చేసిన సామాన్య భక్తులకు ఏఐ టెక్నాలజీ సాయంతో క్యూలైన్లలోకి ప్రవేశించిన 12 గంటల్లోపే దర్శనం చేయించాము. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తూ ఎప్పటికప్పుడు క్యూలైన్ల నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. జనవరి 8వ తేది వరకు ఇదేవిధంగా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులందరూ సమిష్టి కృషి చేస్తున్నాము’ అని తెలిపారు.