ముంబై, జూలై 10 (ఇయ్యాల తెలంగాణ) : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచుతూ భారీగా లబ్ధి పొందుతోంది. మరోవైపు, ఇదే సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ విమర్శల పాలవుతోంది. ఏఐ ఉపయోగం ద్వారా ఒక్క ఏడాదిలోనే సుమారు రూ. 4,285 కోట్లు ఆదా చేసుకున్నామని ప్రకటించిన ఆ సంస్థ, అదే సమయంలో 9,100 మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం.మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జడ్సన్ ఆల్తోఫ్ వెల్లడిరచిన వివరాల ప్రకారం, గత సంవత్సర కాలంలో కంపెనీకి ఏఐ వినియోగం ద్వారా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,285 కోట్లు) ఆదా అయ్యాయి. ముఖ్యంగా కాల్ సెంటర్ కార్యకలాపాల్లో ఏఐని వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, కస్టమర్లకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు.
అయితే, ఈ ఆదా ప్రకటన వెనుకనే 9,100 మంది ఉద్యోగుల తొలగింపు వార్త ఉంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4 శాతం. ఎక్స్‌బాక్స్, గేమింగ్ డివిజన్‌లకు చెందిన ఉద్యోగులపై ఈ లేఆఫ్‌ల ప్రభావం ఎక్కువగా పడిరది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల కోత విధించడం ఇది నాలుగోసారి కావడం ఆందోళన కలిగిస్తోంది.ఈ లేఆఫ్‌ల నేపథ్యంలో, ఉద్యోగాలు కోల్పోయిన వారికి మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఇచ్చిన సలహా తీవ్ర వివాదాస్పదమైంది. ఎక్స్‌బాక్స్ గేమ్ స్టూడియోస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్ టర్నబుల్, ‘‘ఈ కష్టకాలంలో మానసిక బాధ నుంచి ఉపశమనం పొందేందుకు, రెజ్యూమెలు మెరుగుపరుచుకునేందుకు ఏఐ టూల్స్ వాడుకోవచ్చు’’ అని తన లింక్డ్‌ఇన్ పోస్టులో సూచించారు. ఉద్యోగాలు తీసేసింది విూరే, మళ్లీ ఆ బాధను తగ్గించుకోవడానికి విూ టెక్నాలజీనే వాడమంటారా అంటూ ఆయనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.