హైదరాబాద్, ఆగస్టు 12, (ఇయ్యాల తెలంగాణ) : లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు పూర్తయింది. బోనాల సందడి ముగిసిన తర్వాత చేపట్టిన లెక్కింపులో నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు బయటపడ్డాయి. అయితే ఈసారి హుండీలో లభించిన 170 గ్రాముల జర్మన్ సిల్వర్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆలయానికి 12 రోజుల వ్యవధిలో వివిధ రూపాల్లో మొత్తం రూ.9,90,726 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో హుండీల ద్వారా రూ.6,26,226 నగదు సమకూరింది. మిగిలిన ఆదాయం ఇతర కానుకలు, పూజా టికెట్లు, కొబ్బరికాయలు, శాంతి కళ్యాణం తదితరాల ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా నగదుతో పాటు 0.06 గ్రాముల బంగారం, 0.28 గ్రాముల వెండి, 170 గ్రాముల జర్మన్ సిల్వర్ లభించినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణంగా భక్తులు నగదు, బంగారం, వెండి రూపంలో మొక్కులు చెల్లిస్తుంటారు. ఈసారి జర్మన్ సిల్వర్ కూడా హుండీలో లభించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ జర్మన్ సిల్వర్ సాధారణ వెండి ధరతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. తులం రూ.300 నుంచి రూ.400 మధ్య ఉంటుంది. అంటే 17 తులాలు 300 చొప్పున అనుకుంటే రూ.5100 మాత్రమే.హుండీల లెక్కింపు సమయంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీజ్ చేసిన నాలుగు హుండీలను అధికారులు తెరిచి కానుకలను లెక్కించారు. అయితే మరో హుండీ లాక్ ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. దీంతో చివరకు వెల్డింగ్ మిషన్ సహాయంతో లాక్‌ను కట్ చేసి హుండీని తెరిచి లెక్కింపు పూర్తి చేశారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తాజాగా హుండీల లెక్కింపు పూర్తి కావడంతో 12 రోజుల ఆలయ ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు.
