కోల్ కత్తా, మే 09 (ఇయ్యాల తెలంగాణ) : పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయన చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడున్న వేలాది మంది కార్యకర్తలను భావోద్వేగానికి గురిచేసింది. ప్రధాని మోదీ ఆయనను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం కోసం మే 9వ తేదీని ఎంచుకోవడంలో ఒక విశిష్టత ఉంది. నేడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధాని మోదీ, సువేందు అధికారి తొలుత ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బెంగాలీ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతామని సందేశాన్ని ఇచ్చారు. వేదిక అంతా కాషాయమయం కాగా, సువేందు అధికారి కూడా పూర్తి కాషాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి దేశంలోని ప్రముఖ నాయకులందరూ హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని సహా ఎన్డీఏ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు..ముఖ్యమంత్రితో పాటు మరో ఐదుగురు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వంలో సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేశారు.
దిలీప్ ఘోష్: బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు. ఖరగ్‌పూర్ స్థానంలో టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్‌పై భారీ విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అగ్నిమిత్ర పాల్: ఫ్యాషన్ డిజైనర్ నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన అగ్నిమిత్ర, అసన్సోల్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహిళా గళానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆమె మంత్రి అయ్యారు.
అశోక్ కీర్తానియా: బంగావ్ ఉత్తర్ ఎమ్మెల్యే అయిన ఈయన మతువా వర్గానికి చెందినవారు. గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఈయనకు కేబినెట్లో చోటు దక్కింది.
క్షుదీరామ్ టుడు: గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. రాణిబంధ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి నేరుగా మంత్రి పీఠాన్ని అధిరోహించారు.
నిసిత్ ప్రమణిక్: మాజీ కేంద్ర మంత్రి, కూచ్ బెహార్ ఎంపీ. మాతాతంగ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యత చేపట్టారు.
సువేందు అధికారి ప్రస్థానం అత్యంత సాహసోపేతమైనది. ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్న ఆయన, టీఎంసీ తీరుపై అసంతృప్తితో బీజేపీలో చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల నందిగ్రామ్, భవానీపూర్) పోటీ చేసి రెండింటిలోనూ గెలుపొందారు. ముఖ్యంగా మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఆమెను 15,000 ఓట్ల మెజారిటీతో ఓడించడం ద్వారా తన సత్తా చాటారు.
ఏప్రిల్ 23 , 29 తేదీల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికలు బెంగాల్ ముఖచిత్రాన్ని మార్చేశాయి. మే 4న వెలువడిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమైంది. బ్రాహ్మణులు, మహిళలు, గిరిజనులు, మతువాలు, యువత బీజేపీకి అండగా నిలవడంతో ఈ భారీ విజయం సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. “సోనార్ బంగ్లా” (బంగారు బెంగాల్) నిర్మాణమే తమ లక్ష్యమని, అవినీతి రహిత పాలనను అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. నేటితో బెంగాల్ రాజకీయాల్లో సువేందు శకం అధికారికంగా ప్రారంభమైంది.
అఖండ విజయం.. చారిత్రాత్మక మార్పు
మొత్తం 294 స్థానాలకు గాను 207 స్థానాల్లో అఖండ విజయం సాధించి బీజేపీ చరిత్ర సృష్టించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని 80 స్థానాలకే పరిమితం చేసి, బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయడంలో సువేందు అధికారి పోషించిన వ్యూహాత్మక పాత్ర సామాన్యమైనది కాదు. మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత నమ్మినబంటుగా, రవాణా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సువేందు, పార్టీలో అంతర్గత విభేదాల వల్ల 2020లో బీజేపీలో చేరారు. అప్పటి నుండి బెంగాల్లో గ్రామస్థాయిలో బలమైన కేడర్‌ను నిర్మిస్తూ బీజేపీకి వెన్నెముకగా నిలిచారు.
బీజేపీ కార్యకర్తకు ప్రధాని పాదాబిశందనం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శించిన వినమ్రత అందరినీ ఆకట్టుకుంది. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో 98 ఏళ్ల వయసున్న బీజేపీ సీనియర్ కార్యకర్త మఖన్ లాల్ సర్కార్ పాదాలకు మోదీ నమస్కరించి, ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ భావోద్వేగ దృశ్యానికి అక్కడున్న వేలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు.మఖన్ లాల్ సర్కార్‌కు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1953లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమంలో భాగంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్లో ఆయన అరెస్టయ్యారు. అలాంటి సీనియర్ నేత వేదిక వద్దకు వచ్చి పలకరించగానే, ప్రధాని మోదీ ఆయన కాళ్లకు నమస్కరించి గౌరవం చాటారు.పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల తృణమÖల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలుకుతూ, బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసే ఈ చారిత్రక ఘట్టానికి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ కోల్‌కతా వచ్చారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సవిÖక్ భట్టాచార్య, ముఖ్యమంత్రిగా నియమితులైన సువేందు అధికారి ఘనస్వాగతం పలికారు. ‘జై శ్రీరామ’ నినాదాలతో మైదానం మారుమోగింది. అంతకుముందు ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు.
చంద్రబాబు శుభాభినందనలు
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవీ బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారి మంత్రి మండలి సభ్యులకు కూడా చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, ఆయన కన్న వికసిత్ భారత్ స్వప్నం స్ఫూర్తిగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో అధికారం చేపట్టిన సువేందు అధికారి ప్రభుత్వం విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చంద్రబాబు వివరించారు కోల్ కతాలో జరిగిన సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. తాజాగా, సోషల్ విÖడియాలోనూ బెంగాల్ నూతన సీఎంకు శుభాభినందనలు తెలిపారు.
ప్రజల విజయమన్న పవన్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయాన్ని భారత ప్రజల విజయంగా పవన్ అభివర్ణించారు. ముఖ్యంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మించిన బెంగాల్ గడ్డపై, ఆయన ఆశయాలకు అనుగుణంగా బీజేపీ అధికారం చేపట్టడం ఒక గొప్ప నివాళి అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల పోరాటం తర్వాత లభించిన ఈ ఫలితం కార్యకర్తల కృషికి దక్కిన గౌరవమని కొనియాడారు.సరిహద్దు రాష్ట్రమైన బెంగాల్లో అక్రమ వలసలు, తీవ్రవాద చొరబాట్లు జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని… సువేందు అధికారి నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన ఆశించారు. హింస, అరాచకాలకు తావులేకుండా పారదర్శకమైన పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే ఈ విజయానికి పునాది అని చెబుతూ.. అమిత్ షా, నితిన్ నబిన్, సమిక్ భట్టాచార్యలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
