హైదరాబాద్, మార్చి 19 (ఇయ్యాల తెలంగాణ) : నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పని చేశా.. ఇక కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ్టి నుంచి పీసీసీ అధ్యక్షునిగా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి విూట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. నిజానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావు. అయినా రేవంత్ రెడ్డి అలా అనడానికి కారణం.. ఎన్నికల కోడ్ అంత పవర్ ఫుల్ కావడమే. మఖ్యమంత్రి అయినప్పటికీ .. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఆపద్ధర్మ సీఎంలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అంటే..దాదాపు పాలన అంతా.. అంతర్గతంగా జరిగిపోవాలి కానీ.. పబ్లిసిటీ రాకూడదు. అందుకే రేవంత్ రెడ్డి ఇక పీసీసీ చీఫ్‌గా పని చేస్తానంటున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అక్కడ కూడా సేమ్ రూల్స్. అయితే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే అధికారులే ముందుగా బలైపోతారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసోం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానుంది. ఎన్నికలు ఏఏ రాష్ట్రాలలో ఎన్ని దశల్లో, ఏయే తేదీల్లో నిర్వహిస్తారనే వివరాలను ఇవాళ ఈసీ ప్రకటించనుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ ని ఈసీ ప్రకటించగానే దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అమలులో ఉంటుంది. అంటే కొత్త అసెంబ్లీలు, పార్లమెంట్ ఏర్పాటు అయిందని రాష్ట్రపతి, గవర్నర్లకు ఈసీ నివేదికలు సమర్పించిన తర్వాత ఈసీ కోడ్ ను ఎత్తివేస్తుంది. అప్పటి వరకూ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది.
దేశంలో అయినా, రాష్ట్రాల్లో అయినా ఎన్నికల సమయంలో పోలింగ్, కౌంటింగ్‌ను పారదర్శకంగా, సక్రమంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటినే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. రాజకీయ పార్టీలు అధికార, ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టడమే ఎన్నికల కోడ్ లక్ష్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు,ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించే అధికారం ఎలక్షన్ కమిషన్‌కి ఉంటుంది. ఇతర నిబంధనలు ఎలా ఉన్నా అధికారంలో ఉన్న వారు ఓటర్లను ప్రభావితం చేయకుండా.. దుర్వినియోగం చేయకుండా కోడ్ ను పటిష్టంగా అమలు చేస్తారు. అందుకే ఈసీకి సంపూర్ణ హక్కులు దఖలు పడతాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ లేదు. ప్రధాని మినహా ఎవరికీ సెక్యూరిటీ, ప్రోటోకాల్ ఉండేందుకు వీల్లేదు. వ్యక్తులు, సంస్థలకు భూ కేటాయంపులపై ఈసీ అనుమతి కావాల్సిందే. సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ఇచ్చేందుకు వీల్లేదు. అంటే ఒక్క ప్రధానమంత్రికి మాత్రమే ప్రోటోకాల్ ఉంటుంది. ముఖ్యమంత్రులుగా ఉన్న రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు కూడా ప్రోటోకాల్ ఉండదు. వారు సాంకేతికంగా ఆ పదవిలో ఉంటారు..
కానీ ఆ పదవితో పెత్తనం చేయడానికి మాత్రం అవకాశం ఉండదు. ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోకూడదు. ఎంపీ గానీ, మంత్రి గానీ అధికారిక పర్యటనను, పార్టీ పర్యటనను వేర్వేరుగా ఉండేలానే చూసుకోవాలి. రెండిరటినీ కలపకూడదు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు వాటిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు, నేతలపై దర్యాప్తు చేయడానికి, వారికి శిక్ష విధించేందుకు ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉంది.ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక అభ్యర్థులు ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం కోడ్ ఉల్లంఘన అవుతుంది. ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకూడదు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయకూడదు. రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ అధికారులు వాగ్దానాలు చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలలో తాత్కాలిక నియామకాలు చేపట్టకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే మంత్రులు లేదా అభ్యర్థులు తమ పరిధిలోని నిధులను మంజూరు చేయకూడదు. ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వనరులను ఉపయోగించకూడదు.
రవాణా, యంత్రాలు, భద్రతా సిబ్బందితో సహా దేనిని ఉపయోగించకూడదు. ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు, భవనాలు, ఇతర ప్రభుత్వ వసతులను ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థులు ఎన్నికల్లో తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి వీలుండదు.2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. కానీ కౌంటింగ్ కు రెండు నెలలకుపైగా సమయం ఉంది. ఏడు విడతలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. అందుకే.. పోలింగ్ పూర్తయ్యాక.. ఆపద్ధర్మ సీఎం చంద్రబాబు కొన్ని సవిూక్షలు నిర్వహించారు. అయితే అది కూడా వివాదాస్పదమయింది. కొంత మంది అధికారులు ఆయనకు సహకరించలేదు కూడా. ఎందుకంటే.. చంద్రబాబు హయాంలో ఉన్న ఉన్న కీలక శాఖల ఉన్నతాధకారుల్ని ఈసీ మార్చేసింది. అందుకే షెడ్యూల్ వచ్చే సరికి సీఎం పేరుకే ..మళ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పదవి తిరిగి వస్తుంది .
