నల్గోండ జులై 1(ఇయ్యాల తెలంగాణ ): నల్లగొండ పట్టణం నడిబొడ్డున, అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆకార్యాలయాన్ని తక్షణమే కూల్చేయాలంటూ మున్సిపల్ కమిషనర్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్న విూరు.. 100 కోట్ల భూమిలో అనుమతి లేకుండా ఇంద్ర భవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని కమిషనర్ సమాధానం చెప్పగా.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలి తక్షణమే కూల్చేయాలని మంత్రి ఘాటుగా స్పందించారు. అలాగే.. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతుల్లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి సైతం సూచించారు.

