హైదరాబాద్, ఫిబ్రవరి 9, (ఇయ్యాల తెలంగాణ) : 300 డివిజన్లతో దేశంలోనే అతి పెద్ద మహానగరంగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ)ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తేదీన మూడు కార్పొరేషన్లుగా విభజించనుంది. ఈ నేపథ్యంలోనే ఆయా కార్పొరేషన్లు ఏ విధంగా ఏర్పాటు కానున్నాయి? వాటి పేర్లు ఏంటి? ఎంత జనాభాతో ఏర్పాటు కాబోతున్నాయనే ప్రశ్నలు హైదరాబాద్? నగరవాసుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుత కార్పొరేటర్ల పదవీకాలం పూర్తవనుండటంతో తర్వాత నగర పాలన ఏ విధంగా ఉండనుందనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతోంది. 17 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారి పాలన : భాగ్యనగరంలో? 17 ఏళ్ల తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలన రాబోతుంది. పాలకమండలి లేనప్పుడు మేయర్‌కు సమాన హోదాలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించి పరిపాలనను నిర్వర్తిస్తుంది.
చివరి సారిగా 2008 సెప్టెంబరు 4వ తేదీ నుంచి 2009 డిసెంబరు 4వ తేదీ వరకు ఎస్.పి.సింగ్ కమిషనర్, ప్రత్యేక అధికారి హోదాలో జీహెచఎంసీ పరిపాలన బాధ్యతలను చేపట్టారు. ఆయనకు ముందు అంటే 12 మున్సిపాలిటీలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసి జీహెచఎంసీని ఏర్పాటు చేసినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మొట్టమొదటి కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ గా సి.వి.ఎస్.కె.శర్మ నియామకం అయ్యారు. ఆయన 2007 ఏప్రిల్ 16వ తేదీ నుంచి 2008 సెప్టెంబరు 4వ తేదీ వరకు పని చేశారు.పాత జీహెచఎంసీలో రమారమి కోటి మంది జనాభా ఉండేది. ప్రస్తుత జీహెచఎంసీ పరిధిలో 1.34కోట్ల మంది జనాభా ఉంది. అప్పుడు 150 డివిజన్లు ఉండగా డివిజన్ల పునర్విభజనలో భాగంగా అవి 253కు పెరిగాయి. పాత నగరంలో జనాభా అధికంగా ఉన్నందువల్ల డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపయినట్లుగా అధికారులు వివరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో జనాభా అంతంతమాత్రమే. పాత గ్రేటర్ హైదరాబాద్?తో పోలిస్తే ఆయా స్థానిక సంస్థలు రెట్టింపు విస్తీర్ణంలో ఉన్నాయి. జనాభా మాత్రం 30లక్షలే. వాటి పరిధిలో 47 డివిజన్లు ఏర్పాటయ్యాయి.గతేడాది డిసెంబరు 3వ తేదీన జీహెచఎంసీ 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లతో అతిపెద్ద నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. ప్రస్తుత జీహెచఎంసీని 70లక్షల జనాభాతో కూడిన 6 జోన్లకు పరిమితం చేసి సగటున 35 లక్షల జనాభా ఉండేవిధంగా మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను 3 జోన్ల చొప్పున ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
జీహెచఎంసీ కార్పొరేషన్ : శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్
మల్కాజిగిరి కార్పొరేషన్ (ఎంఎంసీ) : మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్
సైబరాబాద్ కార్పొరేషన్ (సీఎంసీ) : కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్
:రాజధాని హైదరాబాద్ నగర అభివద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన విషయం విదితమే. దీనిలో భాగంగానే బాహ్యవలయ రహదారి(ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న 27 పురపాలికలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్?లో విలీనం చేసింది. దాంతో ఓ దశలో జీహెచఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కానుందనే ప్రచారం జరిగింది. కానీ, పరిపాలనా సౌలభ్యం కోసం దీన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన సజావుగా సాగేందుకు హైదరాబాద్ పరిధిలో పోలీసు, పురపాలక శాఖల సరిహద్దులు ఒకేవిధంగా ఉండేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలే రాజధాని పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించింది. హైదరాబాద్ పరిధిని పెంచడంతో పాటు రాచకొండను మల్కాజిగిరిగా మార్చనున్నట్లుగా సమాచారం.