`21వ శతాబ్దపు విముక్తి ఉద్యమ వీరుడు

 `భారతరత్న పొందిన విదేశీయుడు నెల్సన్‌ మండేలా

`నేడు ఆయన జయంతి 

నెల్సన్‌ మండేలా..! ఓ స్వాప్నికుడు…శాంతి కాముకుడు…విశ్వ శాంతికి సంకేతం… పీడనకు, దోపిడీకి, భయానికి తావులేని సమాజం కావాలనేది ఆయన కల. దక్షిణాఫ్రికా విమోచనోద్యమానికి జీవం. మనిషిని పశువుగానో, పనిముట్టుగానో చూడటంపై నిప్పులు చెరిగిన పోరాట యోధుడు. జాతి వివక్ష, దోపిడీ, బానిసత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ధిక్కార పతాకం. దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా కొనసాగిన వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి 27 ఏండ్లు జైల్లో నిర్భంధిచబడిన వాడు. జాత్యహంకార శ్వేత జాతి ప్రభుత్వం పాటిస్తున్న వివక్షను నిరసిస్తూ ఉద్యమించి నల్ల జాతీయులకు విముక్తి కల్పించిన వీరుడు ‘‘ నెల్సన్‌ మండేలా ‘‘. అందుకే ప్రపంచంలో ప్రజలను విముక్తి చేయటం కోసం పోరాడిన అతికొద్ది మందిలో ఒకరిగా కీర్తి పొందారు. భౌతికంగా ప్రపంచానికి దూరమైనప్పటికీ, మానవాళి ఉన్నంత కాలం, వివక్ష, అణిచివేత ఉన్నంతకాలం నెల్సన్‌ మండేలా బతికే ఉంటాడు. సమాజ పరిణామ క్రమంలో బానిసత్వంపై తిరుగుబాటు చేసిన మొదటి తరానికి చెందిన స్పార్టకస్‌, ఏసుక్రీస్తు పేర్లు ఎలాగైతే అజరామరంగా చలామణిలో ఉంటున్నాయో, విముక్తి ఉద్యమాలు జరిగే చోట, దోపిడి, అణిచివేతలు జరిగే చోట వీరి పేరు ఎలా ప్రతిధ్వనిస్తున్నాయో…అలాగే 21వ శతాబ్దపు విముక్తి ఉద్యమ వీరుడిగా నెల్సన్‌ మండేలా పేరు కూడా ప్రతి ధ్వనిస్తూనే ఉంటుంది. 

ఎగిసిపడిన స్వేచ్ఛా పతాక నెల్సన్‌ మండేలా :

అణిచివేతలో మగ్గిపోయి మసిబారిన బొమ్మల్లా ఉన్నవారి కోసం జీవితకాలం ఉద్యమాన్ని కొనసాగించటమే కాదు, తరతరాలుగా తలలు వంచుకొని బ్రతికిన వారిని బ్యాలెట్‌ ( ఓటుహక్కు ) వరకూ తీసుకెళ్లి వారిని జీవమున్న ‘‘ మనుషులుగా ‘‘ నిటారుగా నిలబెట్టెందుకు నేలను చీల్చుకుంటూ ఎగిసిపడిన స్వేచ్ఛా పతాక నెల్సన్‌ మండేలా. అనేక దశాబ్దాల పాటు కొనసాగిన ఉద్యమం ఫలితంగా 1994 ఏప్రిల్‌ 26వ తేదీన ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో నిలబడిన ఒక ఆఫ్రికన్‌ యువకుడు తనను పలకరించిన ఓ ఇంగ్లీష్‌ పత్రిక విలేకరితో  ‘‘ ఇప్పుడు నేను మనిషి ‘‘ అన్న మాట వెనుక వందల వేల మంది ఆత్మార్పణ ఉంది. త్యాగం ఉంది. వారి రక్తం ఉంది. పోరాట యోధుల చిత్ర హింసలున్నాయి. అందుకే దక్షిణాఫ్రికాకు నెల్సన్‌ మండేలా మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పుడు ‘‘ నేల విూద నడిచే దేవ దూత ‘‘ అంటూ కొనియాడారు. దక్షిణాఫ్రికా శాంతియుత పరిణామానికి ఎంతగానో పొగడ్తలు, ప్రసంసలు లభించాయి. దక్షిణాఫ్రికా జాతిపితగా, ప్రజాస్వామ్య వ్యవస్థాపకుడిగా ప్రజల ఆదరణ పొందాడు. ఆఫ్రికా జాతి విముక్తి నేతగా పేరొందాడు. నెల్సన్‌ మండేలా జ్ఞాపకార్థం వివిధ నగరాల్లో మండేలా విగ్రహాలు ప్రతిష్టితమయ్యాయి. 1993లో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నాడు. జాతి వివక్ష నిర్మూలన కోసం మండేలా జరిపిన పోరాటానికి గుర్తుగా ఆయన పుట్టినరోజు జూలై 18 ‘‘ మండేలా డే ‘‘ గా ఐరాస జనరల్‌ అసెంబ్లీ 2009 నవంబర్‌ లో ప్రకటించింది. 

భారతరత్న అత్యున్నత పౌరపురస్కారం :

1990లో భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రకటించింది. బ్రతికుండగానే ఇలాంటి గౌరవం, పురస్కారాలు అందుకున్న నెల్సన్‌ మండేలా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అయితే ప్రపంచ శాంతి అనేది ఒక నినాదంగానే ఉందనేది గుర్తించాలి. ఈ మధ్యకాలంలో అమెరికాలో చోటుచేసుకున్న జాత్యహంకారం ఘటనలు కావచ్చు, మన దేశంలో ఇలాంటి ఘటనలోనే తండ్రీకొడుకులు హతమైన ఘటన కావచ్చు ఇలాంటి మరెన్నో వివక్ష, అణిచివేత దోరణులకు అద్దం పడుతున్నాయి. ఈ తరుణంలో జాతి విముక్తి కోసం, నల్లజాతీయుల యోధుడు నెల్సన్‌ మండేలా స్పూర్తిని పునికిపుచ్చుకోవాలి. జులై 18 ‘‘మండేలా డే’’  ( నెల్సన్‌ మండేలా పుట్టిన రోజు ) సందర్భంగా నెల్సన్‌ మండేలాను స్మరించుకుందాం..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....