Ticker

6/recent/ticker-posts

Ad Code

PAK పై ప్రతీకారం - భారత్‌ ముందు నాలుగు మిలిటరీ ఆప్షన్‌లు !


న్యూడిల్లీ, ఏప్రిల్‌ 25 (ఇయ్యాల తెలంగాణ) : మూడు రోజుల క్రితం పహల్గాం  లో జరిగిన ఉగ్రదాడి తో భారత్‌ ఉలిక్కిపడిరది. ఈ దాడిలో 26 మంది అమాయాక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రూరమైన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌ పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది. భవిష్యత్తులో ఆర్థికంగా కోలుకోకుండా చేసేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది.ఇక పహల్గాంలో నరమేథం సృష్టించిన ఉగ్రవాదులను వదిలిపెట్టకూడదని, వాళ్లకు ధీటైన జవాబు ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకొంటారన్నది చర్చనీయాంశంగా మారింది. భారత ప్రభుత్వం మాత్రం సైనిక చర్య అంశంపై గుంభనంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో భారత్‌ ఎలాంటి అడుగు వేయబోతుందనే విషయంలో నిపుణులు తమతమ అంచనాలను వెల్లడిస్తున్నారు. మొత్తానికి భారత్‌ ఎదుట నాలుగు మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ నాలుగు ఆప్షన్‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రఫేల్‌, మిరాజ్‌లను రంగంలోకి దింపడం..

ప్రస్తుతం వాయుసేనలో అత్యాధునిక ఫైటర్‌ జెట్లు అయిన రఫేల్‌, మిరాజ్‌ విమానాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి పాకిస్థాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేయడం ఇండియన్‌ మిలిటరీ ముందున్న మొదటి ఆప్షన్‌. అదే సమయంలో బాలాకోట్‌పై దాడి అనంతర అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని ఛేదించే సామర్థ్యాలు రఫేల్‌, మిరాజ్‌లకు ఉన్నాయి. అయితే ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉండాలి.

లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ను దాటి..

సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడతామని తాజాగా పాకిస్థాన్‌ బెదిరించింది. ఆ ప్రకారం చూస్తే ఆ దేశం నియంత్రణ రేఖను గుర్తించనట్లు అవుతుంది. దాంతో భారత్‌కు దూకుడుగా ఆపరేషన్లు చేపట్టే అవకాశం లభిస్తుంది. ఇటీవల ఎల్‌వోసీ వద్ద పాకిస్థాన్‌ జరిపిన ఉల్లంఘనలను భారత్‌ కారణంగా చూపవచ్చు. ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్లు చేపట్టవచ్చు. ఇది భారత్‌ ముందున్న మరో ఆప్షన్‌గా చెప్పవచ్చు. కాకపోతే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు భారత దళాలకు సవాల్‌గా మారుతాయి. ఆపరేషన్లకు సుదీర్ఘ సమయం పట్టడం, ఇప్పటికే పలు బలమైన పొజిషన్లలో పాకిస్థాన్‌ దళాలు ఉండటం ప్రతికూలంగా మారవచ్చు.

భారీ టార్గెట్స్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌..

భారీ టార్గెట్లను గుర్తించి సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడం భారత్‌ ముందున్న మూడో ఆప్షన్‌. కాకపోతే ఇప్పుడు పాకిస్థాన్‌ అప్రమత్తంగా ఉండటంతో సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంత సులువు కాకపోవచ్చు. సక్సెస్‌ఫుల్‌గా సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాలంటే రియల్‌టైమ్‌ ఇంటెలిజెన్స్‌, శక్తిమంతమైన దళాలు, కచ్చితమైన ప్లానింగ్‌ అవసరం.

శతఘ్నులు, స్నైపర్లతో కాల్పులు..

ఇక లక్ష్యాలపై గురిపెట్టి భారీ శతఘ్నులు, స్నైపర్‌ గన్స్‌తో కాల్పులు జరపడం భారత్‌ ముందున్న నాలుగో ఆప్షన్‌గా చెప్పవచ్చు. వీటితోపాటు భారీ మోర్టార్లను కూడా వాడవచ్చు. దాంతో ఉద్రిక్తతలకు అవకాశం తక్కువగా ఉంటుంది. నియంత్రణ రేఖ సవిూపంలోని శత్రుస్థావరాలు, సరఫరాల మార్గాలు, ఔట్‌పోస్టులను తుడిచిపెట్టవచ్చు. కాకపోతే ఈ దాడులతో ఫలితం పెద్దగా ఉండదు. భారీ దాడులతోనే భారీ ఫలితం దక్కుతుంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు