హైదరాబాద్, ఏప్రీల్ 15 (
ఇయ్యాల తెలంగాణ) : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దశాబ్ద కాలంగా కృషి చేస్తున్న పాతబస్తీకి చెందిన ఎస్సీ డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్ కు దళిత రత్న అవార్డు వరించింది. పాతనగరం కందికల్ గేట్ ప్రాంత వాసి అయిన పులి కంటి నరేష్ కు దళిత రత్న అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ దళిత రత్న అవార్డును ప్రధానం చేసింది. పాత నగరంలో ఎస్సీ అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా నరేష్ షెడ్యూల్ కులాలు తెగలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. నిరుపేదల సంక్షేమానికి పులి కంటి నరేష్ అనేక కార్యక్రమాలు చేశారు.

యువతీ, యువకులకు వృత్తి పనుల్లో శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటుగా వెనుకబడిన బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు , విద్యుత్ దీపాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తూ నరేష్ పాత నగరంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. దశాబ్ద కాలంగా అందిస్తున్న ఆయన సేవలను గుర్తించి అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆయనకు దళితరత్న అవార్డును ప్రధానం చేసింది. దళిత రత్న అవార్డును స్వీకరించిన పులికంటి నరేష్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సన్మానం చేసి అభినందించారు. తన సేవలను గుర్తించి దళిత రత్న అవార్డు అందించినందుకు అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ప్రతినిధులకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. దళిత రత్న అవార్డు పొందిన నరేష్ ను పలువురు పాత నగరంలోని పలు రాజకీయ పార్టీల ప్రముఖులు అభినందించారు.
0 కామెంట్‌లు