Ticker

6/recent/ticker-posts

Ad Code

Telugu వారికి తరిగిపోని మధురామృతం అందించిన గానగంధర్వుడు ఘంటసాల


`నేడు ఘంటసాల వర్ధంతి

 ఘంటసాల గానం వినగానే తెలుగువారి మది ఆనందసాగరంలో మునకలు వేస్తుంది. ఈ నాటికీ ఘంటసాల పాటతోనే తెలుగునాట ఎన్నో కోవెలలు మేలుకొలుపు పాడుతూ ఉన్నాయి. మాస్టారు గానం చేసిన భక్తిగీతాలు, భగవద్గీత శ్లోకాలు తెలుగువారికి సుపరిచితాలు. ఆ గళంలో జాలువారిన ప్రతీపదం అమృతమయం అవుతుందని తెలుగువారి విశ్వాసం. ఘంటసాల గాత్రం వెలువరించిన గీతాలు ఈ నాటికీ పరవశింప చేస్తూనే ఉన్నాయి... ముఖ్యంగా ఆయన పాడిన భక్తి గీతాలు ఎందరిలోనో ఆధ్యాత్మిక భావం నెలకొల్పుతున్నాయి.

ఘంటశాల వెంకటేశ్వరరావు 1922 డిశంబర్‌ 4న గుడివాడ మండలం చౌటపల్లిలో ఘంటశాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుండే భజనలు, కీర్తనలు తండ్రి వెంట పాడుతూ ఉండేవారు. తండ్రి ఆశయం నెరవేర్చాలనే లక్ష్యంతో సంగీత గురుకులంలో చేరారు. అక్కడి కట్టుబాట్లను తట్టుకోలేక తిరిగి సొంత ఊరికి వచ్చేశారు. తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళలో పని చేస్తూ సంగీతం అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పని ఒత్తిడి పెరగడంతో ఆయన సంగీత కళాశాలలో చేరాలని అనుకున్నారు. 40 రూపాయలు విలువ చేసే ఉంగరాన్ని కేవలం రూ.8రూపాయలకు అమ్మి ఆంద్రలో ఏకైక సంగీత కళాశాలలో చేరారు. అక్కడ ఉంటూ రోజుకు ఒక్కపూట భోజనం చేస్తూ అద్దె కట్టేందుకు డబ్బు లేక ఆ ఊళ్ళో ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో తలదాచుకునేవారు. తరచూ ఆ గుడికి వచ్చే పట్రాయని సీతారామశాస్త్రి ఘంటశాల గురించి తెలసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణనివ్వడానికి అంగీకరించారు. శాస్త్రి చాలా పేదవారు కావడంతో భోజన వసతి కల్పించడానికి చాలా ఇబ్బందులు పడేవారు.

1942లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలు అలీపూర్‌ జైల్లో జైలు శిక్ష అనుభవించారు. 1944 మార్చి4న సావిత్రమ్మతో పెళ్ళి జరిగింది. తన పెళ్ళిలో తనే కచేరి చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు ఘంటసాల. ఘంటశాలలోని గాన సామర్థ్యాన్ని గుర్తించిన సముద్రాల నాటి మద్రాసులోని రేణుకా ఫిలింస్‌కు తీసుకువెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్‌ రెడ్డిలకు ఎదుట పాటకచ్చేరీ చేయించారు. తరువాత ఘంటశాల తన మకాంను పానగల్‌ పార్కు వాచ్‌మెన్‌కు నెలకు రూ.2/`లు ఇచ్చే ఒప్పందం చేసుకుని అక్కడకు మార్చారు. పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవారు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. పాటలు పాడుతూ సినీరంగంలో చిన్న చిన్న వేషాలు వేసేవారు.

1947లో లక్ష్మమ్మ చిత్రానికి సంగీత దర్శకునిగా మారారు. 100 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహించారు. 1969`72 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్ధాన గాయకునిగా కొనసాగారు. 1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1969 నుంచి తరచూ ఘంటశాల అనారోగ్యానికి గురయ్యేవారు. 1971లో ఐరోపా, ఆమెరికాలో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ఘంటశాలకు గుండెనొప్పి వచ్చింది. హుటాహుటీన అక్కడి ఆసుపత్రికి తరలించారు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలనే కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసి సినిమా పాటలు పాడుకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత 1972లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు వంటి హిట్‌ చిత్రాలకు పాటలు పాడారు. ఘంటశాల గొంతు నుండి జాలువారిన భగవద్గీత శ్లోకాలు నేడు పార్థివ దేహాల వద్ద ఆలపించే పాటలుగా మారాయి. 1974 నాటికి అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు