హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఇయ్యాల తెలంగాణ) : దళిత సామాజిక వర్గంలోని అన్ని సామాజిక వర్గాలకు సమాన వాత సాధించుకునేందుకు సమిష్టిగా పోరాడుదాం అని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో  బేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు.  ఎస్సీ వర్గీకరణలోని గ్రూప్‌ వన్‌ లోని పంబాల మన్నే కులాలను వెంటనే తొలగించాలి, అత్యంత వెనుకబడిన గ్రూప్‌1 కులాలకు ఒక శాతం రిజర్వేషన్‌ 3 శాతానికి పెంచాలి అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికి చిన్నపాటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. వర్గీకరణ ఉద్యమానికి 30 ఏళ్ల చరిత్ర ఉందని తన సామాజిక వర్గానికి ఎంత వాటా కోరుకుంటున్నానో అదే స్థాయిలో ఆయా సామాజిక వర్గాలకు సమాన వాట దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందుకోసం తాను ముందు వరసలో ఉండి పోరాడుతానని చెప్పారు. జనాభా ఆధారంగా ప్రతి సామాజిక వర్గం రిజర్వేషన్లు సాధించడంతోపాటు సామాజిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు పొందాల్సిందే నన్న దృఢసంకల్పంతో తాను ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పోరాటాలతోనే ఏదైనా సాధించగలమని అన్నారు.