శ్రమదోపిడికి వెట్టిచాకిరికి గురవుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో విద్యా శాఖ పరిధిలో గల సమగ్ర శిక్షా లో ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా వెట్టిచాకిరి కి శ్రమదోపిడికి గురౌతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,300 మంది పాఠశాల స్థాయి, స్కూల్ కాంప్లెక్స్ స్థాయి,మండల స్థాయి, జిల్లా స్థాయిలో విద్యా శాఖ కు సంబంధించిన సమగ్ర శిక్షా లో వివిధ హోదాల్లో పనిచేస్తూ విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. తెలంగాణ సమగ్ర శిక్షా లో ఉద్యోగాల కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్ గా నోటిఫికేషన్ విడుదల చేసి రాత పరీక్షలను నిర్వహిస్తారు.ప్రతిభ ఆధారంగా రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి సమగ్ర శిక్షా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.
గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలు లేకుండా, రోస్టర్ పాయింట్లు, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఎంపిక చేసిన కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పర్మినెంట్ చేసిన ప్రభుత్వం అన్ని అర్హతలు ఉండి అన్ని రకాల పరిక్షలను నిర్వహించిన సమగ్ర శిక్షా ఉద్యోగులకు పర్మినెంట్ చేయకపోవడం లో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న కెసిఆర్ కు, ఆర్థిక శాఖ మంత్రి గా ఉన్న టి.హరీష్ రావుకు, విద్యా శాఖ మంత్రిగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధిత విద్యా శాఖ అధికారులకు అనేక సార్లు విజ్ఞాపన పత్రాలను సమర్పిస్తే వీలైనంత త్వరగా పర్మినెంట్ చేస్తామని టైం స్కేల్ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారే తప్ప అమలు చేసిన పాపన పోలేదని విమర్శించారు.
సెప్టెంబర్ 13,2023 లో వరంగల్ హన్మకొండ ఏకశిలా పార్క్ దగ్గర సమగ్ర శిక్షా ఉద్యోగులు ధర్నా చేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మద్దతు తెలిపి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని రేవంత్ సర్కార్ వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పటికి అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కేంద్ర స్థానాలలో నిర్వహిస్తున్న న్యాయమైన డిమాండ్ కోసం చేస్తున్న ధర్నలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నాయని సమగ్ర శిక్షా ఉద్యోగులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ లో అధిక నిధులను మంజూరు చేస్తూ విద్యా, వైద్య శాఖలలో ఉద్యోగ, ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున నియమించి అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తూ విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తున్న రేవంత్ సర్కార్ విద్యా శాఖ అనుబంధంగా పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం చేస్తారనే నమ్మకం తో సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని శాఖలకు మంత్రులను కేటాయించిన విద్యా శాఖ స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం తెలంగాణ విద్యా శాఖ సమస్యలకు అన్నింటిని పరిష్కరిస్తున్నారని సమగ్ర శిక్షా ఉద్యోగుల వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలించి పర్మినెంట్ చేస్తారనే నమ్మకం తో ఉన్నారు.సమగ్రశిక్షా ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపజేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులలో సమగ్ర శిక్షా ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు.
అటెండర్ నుండి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం,పి.ఈ.టి పనులు, జూనియర్ అసిస్టెంట్ పనులు మిగతా అన్ని బోధన, బోధనేతర పనులలో పూర్తిగా సహాయం చేస్తున్నారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులు నిర్వహిస్తున్న విధులు
👉 జిల్లా స్థాయిలో (APos, System analyst, Technical Operator,DLMT, Messager)
👉 మండల స్థాయి లో ( MIS Co.Ordinator,Data Entry Operators,IERPS Messenger)
👉 స్కూల్ కాంప్లెక్స్ స్థాయి లో ( Custor Resource Person ( CRPS )
👉 పాఠశాల స్థాయిలో ( Part time instructor ( Art,PET, Work Education)
లలో పనిచేస్తు విద్యా శాఖ లో పనిచేస్తున్నారు.
👉 సమగ్ర శిక్షా ఉద్యోగులు 33 జిల్లా కేంద్రాలలో ధర్నా లు చేస్తున్నారు.
వారి ప్రధాన డిమాండ్ లు ఈ విధంగా ఉన్నాయి.
👉 1. సమగ్ర శిక్షా ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలి.అప్పటి దాకా పే స్కేలు ఇవ్వాలి.
👉 2.ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలి.
👉 3.SSA ఉద్యోగులకు పదవీ విరమణ చేస్తున్న మరియు చేసిన వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలి.
👉 4.ప్రభుత్వ మరియు విద్యా శాఖ నియామకాలలో వెయుటెజ్ కల్పించాలి
👉 5.PTI లకు 12 నెలల వేతనం ఇవ్వాలి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పరిపాలన చేస్తుండడంతో గత రెండు దశాబ్దాలుగా వెట్టిచాకిరి చేసి శ్రమదోపిడికి గురైన సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.సమగ్ర శిక్షా ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని పూర్తి నమ్మకం తో పూర్తి విశ్వాసం తో సమగ్ర శిక్షా ఉద్యోగులు ఉన్నారు.
వ్యాస కర్తలు :
డాక్టర్.శ్రీవాటి శ్రీనాథ్.,
డాక్టర్.ఎస్. విజయ భాస్కర్,
0 కామెంట్‌లు