సికింద్రాబాద్, డిసెంబర్ 11, (ఇయ్యాల తెలంగాణ) : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా.. రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా.. యాదాద్రికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. యాదాద్రి రైల్వే స్టేషన్ ప్రతిపాదిత డిజైన్ లను విడుదల చేసింది. ఆలయం రూపంలో ప్రతిపాదిత డిజైన్ ఉంది.అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా.. యాదాద్రి రైల్వే స్టేషన్‌ను పునర్ అభివృద్ధి చేస్తున్నట్టు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రూ.24.5 కోట్లతో..యాదాద్రి స్టేషన్‌ను అభివృద్ధి చేయబోతున్నట్టు వివరించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదిత డిజైన్‌లపై విడుదల చేసింది. ఆలయం రూపం వచ్చేలా యాదాద్రి స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.దేశంలోని రైల్వేస్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా అధునాతన సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకాన్ని ప్రారంభించింది. రైల్వే స్టేషన్ల అప్ గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా.. తెలంగాణలో మొత్తం 39 స్టేషన్లను రైల్వేశాఖ గుర్తించింది. వీటిని పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో తెలంగాణ నుంచి 21 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.
మొదటి విడతలో 21..
👉 యాదాద్రి (యాదాద్రి భువనగిరి)` రూ.24.5 కోట్లు
👉 హైదరాబాద్ (నాంపల్లి) ` రూ.309 కోట్లు
👉 నిజామాబాద్ ` రూ.53.3 కోట్లు
👉 కామారెడ్డి ` రూ.39.9 కోట్లు
👉 మహబూబ్‌నగర్ ` రూ.39.9 కోట్లు
👉 మహబూబాబాద్ ` రూ.39.7 కోట్లు
👉 మలక్‌పేట్ (హైదరాబాద్)` రూ.36.4 కోట్లు
👉 మల్కాజ్‌గిరి (మేడ్చల్) ` రూ.27.6 కోట్లు
👉 ఉప్పుగూడ (హైదరాబాద్)` రూ.26.8 కోట్లు
👉 హఫీజ్ పేట (హైదరాబాద్) ` రూ.26.6 కోట్లు
👉 హైటెక్ సిటీ (హైదరాబాద్) `రూ. 26.6 కోట్లు
👉 కరీంనగర్ ` రూ.26.6 కోట్లు
👉 రామగుండం (పెద్దపల్లి)` రూ.26.5 కోట్లు
👉 ఖమ్మం ` రూ.25.4 కోట్లు
👉 మధిర (ఖమ్మం) ` రూ.25.4 కోట్లు
👉 జనగాం ` రూ.24.5 కోట్లు
👉 కాజీపేట జంక్షన్ (హన్మకొండ)` రూ.24.5 కోట్లు
👉 తాండూర్ (వికారాబాద్)` రూ.24.4 కోట్లు
👉 భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)` రూ.24.4 కోట్లు
👉 జహీరాబాద్ (సంగారెడ్డి)` రూ.24.4 కోట్లు
👉 ఆదిలాబాద్ ` రూ.17.8 కోట్లు
ఏం చేస్తారు..
రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం ప్రారంభించిన ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకంలో భాగంగా.. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, స్టేషన్లో స్వచ్ఛత ఉండేలా చూడటం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్ , టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై`ఫై సదుపాయాన్ని కల్పిస్తారు. స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ షాపులు, ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, స్టేషన్ ముందు, వెనక భాగాల్లో మొక్కల పెంపకం, చిన్న గార్డెన్లు వంటివి ఏర్పాటు చేస్తారు.రైల్వే స్టేషన్ లో బిజినెస్ విూటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారు. దీంతోపాటు అవసరమైన నిర్మాణాలు చేపట్టడం, నగరానికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడం, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సుస్థిర`పర్యావరణ అనుకూల పరిష్కారాలు, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ బాటలు, రూఫ్ ప్లాజాలు, అవసరమయ్యే ఇతర వసతులను కూడా ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకంలో భాగంగా చేపట్టనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేవిధంగా అభివృద్ధి చేసేందుకు రూ. 715 కోట్లు, చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి రూ.221 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.
0 కామెంట్‌లు