మళ్లీ భూములన్నీ సర్వే చేస్తారా..? కొత్త చట్టంలో 19 సెక్షన్లు
హైదరాబాద్, ఇయ్యాల తెలంగాణ :
మేం అధికారంలోకి వచ్చాక ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తాం అంటూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పదేపదే ప్రకటనలు చేశారు రేవంత్ రెడ్డి. అనుకున్నట్లుగానే ధరణి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చింది.
కొత్త చట్టంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించామని ప్రభుత్వం చెబుతుండగా.. ధరణి రద్దుతో భూముల మోసాలు పెరుగుతాయని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.
అయితే, చట్టం చేసినంత మాత్రాన సమస్యలన్నీ పరిష్కారం కావని, దాని నియమ నిబంధనలు బహిర్గతం అయితేనే ఏదైనా తెలుస్తుందని మాజీ జాయింట్ కలెక్టర్ సురేశ్ పొద్దార్ అభిప్రాయపడ్డారు.
ఇంతకీ కొత్తగా వచ్చిన చట్టం ఏ చెబుతోంది...
ధరణికి, భూభారతికి ఉన్న ప్రధాన తేడాలు ఏమిటి.. ఒకసారి చూద్దాం,
గత 50 ఏళ్లలో మూడో చట్టం:
తొలుత 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్వోఆర్, రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాసుబుక్ యాక్ట్ వచ్చింది. 1989లో పూర్తి స్థాయి నిబంధనలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.
అప్పట్నుంచి కూడా అదే చట్టం అమల్లో ఉంది.
2020 నవంబరు 2న ధరణి చట్టం ఆర్వోఆర్ ను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది.
అప్పటివరకు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఆ తర్వాత రెవెన్యూ రికార్డులు పహాణి,లో దరఖాస్తు చేసుకుంటే మ్యూటేషన్ యాజమాన్య హక్కుల మార్పిడి, చేసేవారు.
దీన్ని రద్దు చేసి తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించారు.
ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, భూ రికార్డులు తారుమారు చేయడం, భూమి యాజమాన్య హక్కులపై వివాదాలు, పేద రైతుల దరఖాస్తులతో ఇబ్బందులు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి.
ధరణి స్థానంలో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ ` 2024. దీన్నే భూభారతిగా పిలుస్తున్నారు.
కొత్త చట్టంలో ఏమున్నాయంటే:
కొత్త ఆర్వోఆర్ చట్టంలో మొత్తం 19 సెక్షన్లు ఉన్నాయి. ఈ చట్టం విధి విధానాలు ఖరారు చేసేందుకు 2024 జనవరిలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం.
18 రాష్ట్రాల్లో కమిటీ అధ్యయనం చేసి చట్టం తయారు చేసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
భూభారతి బిల్లును ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. మూడు నెలల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయని మంత్రి చెప్పారు.
22, 23 సార్లు డ్రాఫ్టులు మారుస్తూ చట్టాన్ని రూపొందించాం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చట్టాన్ని తీసుకురావాలని భావించాం. అందుకే ఆలస్యం అయ్యింది. ఆర్వోఆర్ 2020ను పూర్తిగా రద్దు చేసి కొత్తగా భూభారతి చట్టం తీసుకువచ్చాం. అని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
భూభారతి చట్టంలో ఏ మార్పులున్నాయి?
ధరణితో పోల్చితే భూభారతి చట్టంలో మార్పులు చేసినా తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసే అధికారాలు యధావిధిగా ఉంచింది. క్లియర్ టైటిల్ ఉంటే ఏకకాల రిజిస్ట్రేషన్`మ్యూటేషన్ చేస్తారు. ధరణిలో 33 మాడ్యుళ్లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో 6 మాడ్యుళ్లు దరఖాస్తుల విధానాలు: తీసుకువచ్చారు. గతంలో ఒక మాడ్యుల్ బదులు మరో మాడ్యుల్ లో దరఖాస్తు చేసుకుంటే ప్రతిసారి రైతులు రూ.1200 కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం ఉండదని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, తెలంగాణలో వివిధ రకాల భూములు ఉండటంతో ఆ మాడ్యుళ్లు ఎంతవరకు సరిపోతాయనేదానిపై రెవెన్యూ నిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
భూముల దరఖాస్తు స్థితిగతులు తెలుసుకునేందుకు ఎస్‌ఎంఎస్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
వ్యవసాయ భూముల పూర్తి సమాచారం నమోదు చేస్తారు. ధరణి రాకమునుపు భూ యజమాని పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు, అనుభవదారు లేదా పట్టాదారు పేరు, భూమి స్వరూపం, విస్తీర్ణం.. ఇలా 32 కాలమ్స్ తో పహాణి నిర్వహించేవారు. ఇప్పుడు 11 కాలమ్స్‌తో పహాణీ తిరిగి తీసుకువస్తోంది ప్రభుత్వం.
తహసీల్దారు స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే, ఆపై ఆర్డీవో, అక్కణ్నుంచి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. కలెక్టర్ దగ్గర కూడా న్యాయం జరగలేదనుకుంటే, ఆ ఉత్తర్వులపై 30 రోజుల్లో భూ పరిపాలన ట్రిబ్యునల్‌కు వెళ్లే వీలుంటుంది.
న్యాయపరమైన చిక్కుల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భూ పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనుంది
.రైతులకు ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేందుకు మండల స్థాయిలో వలంటీర్ వ్యవస్థ రానుంది.
2018లో జరిగిన భూమి ఫైళ్ల ప్రక్షాళనలో సమస్యలు గుర్తించిన లేదా పార్ట్`బి కింద ఉన్న 18.26లక్షల ఎకరాల స్వరూపంతో సంబంధం లేకుండా భూములకు హక్కుల జారీ చేస్తారు.
2014, జూన్ 2కు ముందు జరిగిన సాదా బైనామాలకు కొనుగోళ్ల క్రమబద్దీకరణ చేస్తారు. ఆర్వోఆర్ చట్టం సెక్షన్ 6(1) ప్రకారం ఆర్డీవో స్థాయిలో విచారణ చేసి క్రమబద్ధీకరిస్తారు.
ఏళ్ల తరబడి నివాస స్థలాలపై హక్కులు లేని గ్రామకంఠం భూములకు పాసు పుస్తకాలు జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
వీలునామా లేని ఆస్తుల విషయంలో యాజమాన్య హక్కులు ఏకకాల రిజిస్ట్రేషన్`మ్యూటేషన్ రద్దు చేసింది. ఇక నుంచి మ్యూటేషన్ చేయాలంటే వారసులందరూ కలిసి సంయుక్త వివరణ ఇవ్వాలి. అప్పుడు కుటుంబంలోని అందరికీ తహసీల్దారు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారు. ఆ తర్వాతే మ్యూటేషన్ పూర్తి చేస్తారు.
మోసపూరితంగా పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేస్తే దాన్ని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది. ధరణి లో ఈ అవకాశం ఉండేది కాదు. తహసీల్దార్‌ను విధుల నుంచి తొలగించడం లేదా దానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కలెక్టర్‌కు కొత్త చట్టం అధికారం కల్పిస్తోంది.
భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య.!
భూభారతి చట్టంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం భూధార్.
భారత పౌరులకు ఆధార్ ఎలా ఉందో.. అదే తరహాలో భూములకు భూధార్ తీసుకువస్తామని కొత్త చట్టంలో ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే విషయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టులోనూ ఉంది.
ప్రతి భూ కమతానికి ప్రత్యేక కార్డు, సంఖ్య జారీ చేస్తారు.
అయితే, భూముల సర్వే జరగకుండా భూధార్ కార్డు జారీ చేస్తే యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తే అవకాశం ఉందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుత రికార్డుల ప్రకారం తాత్కాలిక, పూర్తి స్థాయి సర్వే తర్వాత శాశ్వతంగా భూధార్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.
దీని ప్రకారం మరోసారి తెలంగాణలో వివిధ దశల్లో భూముల సర్వే జరిగే వీలుందని రెవెన్యూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయంపై సురేశ్ పొద్దార్ బీబీసీతో మాట్లాడారు. ‘’భూధార్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాకపోతే ఇది క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు చేస్తారనే విషయంపై సందిగ్ధత ఉంది.
తెలంగాణలో చాలావరకు పట్టాభూములకు బై నంబర్లు ఉంటాయి. అవి వందల సంఖ్యలో ఉంటాయి. వాటన్నింటిని గుర్తించాలంటే సమగ్ర భూ సర్వే చేయాలి. అలా చేయడానికి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే వీలుంది.
ప్రతి భూమికి మ్యాప్ పెడతామని చెబుతున్నారు. అది కూడా ప్రాక్టికల్‌గా సాధ్యమవుతుందా.. అనేది అనుమానమే?
భూధార్ అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది అని ఆయన చెప్పారు.
మొత్తం భూభారతి చట్టం పరిశీలిస్తే 1971లో వచ్చిన చట్టం, దానికి అనుబంధంగా 1989లో తీసుకువచ్చిన నిబంధనలను సాంకేతికతంగా అప్‌డేట్ చేస్తే సరిపోయేదని, కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు సురేశ్ పొద్దార్.భూభారతి పై అభ్యంతరాలేమిటి..?
చట్టాన్ని తీసుకువచ్చినట్టుగా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధ్యయనం సరిగా జరగలేదని ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
పహాణీలు రాయడం మొదలుపెడితే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది. భూముల రికార్డులు సరిగా చేయడంతో రేట్లు బాగా పెరిగాయి. ధరణి రద్దుతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. ధరణి వచ్చాక భూ మోసాలు తగ్గాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టంతో మళ్లీ పెరిగే అవకాశం ఉంది.’’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ట్రిబ్యునల్లో ఎవరెవరు ఉంటారనే విషయంపై స్పష్టత లేదు. భూభారతి చట్టంలో ఆర్వోఆర్ సంబంధించిన అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయే తప్ప ప్రొహిబిషన్ భూముల జాబితాపై స్పష్టత లేదు. ధరణిలోని 16 రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెబుతున్నారు గానీ ఏ విధంగా చూపుతారనేది చెప్పడం లేదు.అని సురేష్ పొద్దార్ చెప్పారు.
0 కామెంట్‌లు