హైదరాబాద్, సెప్టెంబర్ 27, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాటిలో కొన్ని అమలు చేసి మరికొన్ని పెండిరగ్లో పెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే మహిళల ఓట్లతోనే పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్, వారికి ఎన్నికల సందర్భంలో ఓ ముఖ్యమైన హావిూ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆడబిడ్డల పెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. మహాలక్ష్మి పథకం కింద రూ.లక్ష, తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2500, పింఛన్ రూ.4000 ఇస్తామని పలు సందర్భాల్లో హస్తం పార్టీ ప్రకటించింది.కాంగ్రెస్ ఇచ్చిన హావిూలను నమ్మిన ఆడబిడ్డలు ఆ పార్టీకి అధికారం కట్టబెడితే 9 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం హావిూ అమలు దిశగా అడుగులు వేయలేదు. ఇటీవల డిసెంబర్ 7 తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా. ఏ మూలనో మహిళలకు నమ్మశక్యం కావడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అంటే గడిచిన 10 నెలల కాలంలో వేలాది మంది ఆడబిడ్డల వివాహాలు జరిగాయి. మరి వారందరికీ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తరా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇటు నగదు, అటు బంగారం అంటే ఆర్థిక భారంతో కూడుకున్నది అని, అసలే బంగారం రేటు విపరీతంగా పెరుగుతున్నదని, వీటన్నిటిని భరిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హావిూని నిలబెట్టుకుంటుందన్నది అనుమానమేనని రాజకీయ విశేష్లకులు అంటున్నారు.ఏదో మార్పు వస్తుందని.. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హావిూలను నెరవేరుస్తుందని ఆ పార్టీని గెలిపిస్తే ఇప్పుడు మొత్తానికే హావిూల ఉసేత్తడం లేదని ఆడబిడ్డలు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పి దానినీ తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని, కేవలం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లలో తప్ప కనీసం సూపర్ లగ్జరీ బస్సుల్లో అమలు చేయడం లేదని, ఈ పథకాన్నేతూతు మంత్రంగా అమలు చేస్తున్న కాంగ్రెస్.. ఆర్థికంగా మరింత భారమయ్యే పథకాలను అమలు చేస్తుందా? అని పెదవి విరుస్తున్నారు.
అసలే ఆడబిడ్డల పెళ్ళంటే ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారం. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పడం వారిలో భరోసా నింపింది. సుమారు లక్షన్నరకు పైగా వరకు ప్రభుత్వం నుంచి వస్తాయన్న నమ్మకం కుదిరింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా మహాలక్ష్మి పథకం ఉసెత్తకపోవడం నిరుపేద తల్లిదండ్రుల్లో అసహనానికి కారణమవుతున్నది.మహాలక్ష్మి పథకంలో ఇంకో అతి ముఖ్యమైనది రూ.2500 పథకం.. దీని కేసం పేద యువతులు, గ్రుహిణులు వేయికండ్లతో ఎదురు చూస్తున్నారు. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన యువతులు తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకూడదని, అటు గ్రుహిణులు ఈ పథకం తమ కుంటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారు, చదువుకోని వారు ఉపాధి అవకాశాలు లేక.. ఇండ్ల నుంచి బయటకు రాలేక.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.2500 ఎప్పుడు తమ చేతికి వస్తయా? అని ఎదురు చూస్తున్నారు.