హైదరాబాద్, (ఇయ్యాల తెలంగాణ) సకలాంగుల కంటే వికలాంగులే జీవితంలో రాణీంచారని టిజేఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్ కోదండరామ్ పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ వికలాంగులు కొన్ని పోస్టులకి పనికిరారు అని ఐఎఎస్ అధికారి స్మీతా సబర్వాల్ అన్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమన్నారు. 2016 లో భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టం తయారైందని, ఆ
హక్కుల చట్టంతో పాటు ఆర్టికల్ 3
ప్రకారం వైకల్యం కల్గిన ప్రతి ఒక్కరికి అందరితో సమానంగా ఎదగడానికి అవకాశాలు కల్పించాలన్నారు. కేవలం స్వేచ్ఛగా మాత్రమే కాదు వారికి ఆత్మగౌరవంతో జీవించడానికి కావల్సిన పరిస్థితులను ప్రభుత్వమే కల్పించాలన్నారు. వారి వైకల్యం పేరుతో వాళ్ల హక్కులను హరించడానికి వీలు లేదన్నారు. ఆర్టికల్ 7 ప్రకారం వికలాంగులను దూషించినా,వారిపై దాడికి దిగినా హింసించినా అవి కూడా పెద్ద నేరాలుగా పరిగణించి వారిపై చర్యలు తిసుకోవాలన్నారు. ఇలాంటి చట్టాన్ని అమలు చేయాల్సిన స్థానంలో ఉన్న ఒక అధికారి వారి వైకల్యాన్ని ఎత్తి పొడుస్తూ, కించపరుస్తు నీచంగా వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. సకలాంగుల కంటే వికలాంగులే జీవితంలో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకున్న దాఖలాలు ఉన్నాయన్నారు. దేశం యొక్క కీర్తీ ప్రతిష్ఠలు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. చట్టాన్నే అమలు పర్చాల్సిన అధికారే వికలాంగులపై తప్పుడు వ్యాఖ్యలు చేసి తిరిగి సమర్ధించుకోవడం శోచనీయమన్నారు. మొత్తం నాగరిక సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని అన్నారు. వైకల్యాన్ని ఒక శాపంగా చూసే సాంప్రదాయక ఆలోచన సరళీని సమాజం ముక్త కంఠంతో ఖండించాలన్నారు.