శ్రీకాళహస్తి జూలై 18 (ఇయ్యాల తెలంగాణ) : నేరాలు అదుపు చేయడానికి... నేరాలు జరిగితే త్వరగా బాధితులకు న్యాయం చేయడానికి... నేరస్థులను త్వరగా గుర్తించడానికి పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో కూడా సీసీ కెమెరాలున్నాయి. పోలీసులు దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాటి నిర్వహణ గురించి ఎవరూ పట్టించుకోక పోవడంతో నిఘా అరకొరగా మారింది. కొన్ని కెమెరాలు పూర్తిగా పనిచేయడం లేదు. మరికొన్ని పనిచేస్తున్నా ఊరు చూడమంటే ఉత్తరం చూసే విధంగా పలు భంగిమల్లో ఉన్నాయి. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అంటుంటారు. చాలా పట్టణాలు, నగరాల్లో సీసీ కెమెరాలతోనే ట్రాఫిక్ నియంత్రణ కూడా జరుగుతున్నది. విదేశాల్లో కూడా సిసి కెమెరాల ద్వారా పోలీసులు నిర్వహణ చేస్తున్నారు. సుమారు లక్ష మంది జనాభా... ప్రతిరోజు 30 వేల మంది భక్తులు వచ్చే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మాత్రం నిఘా నేత్రాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సీసీ కెమెరాల నిర్వహణపై పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది. ఉన్నతాధికారులకు తెలియ జేయడం... ప్రభుత్వానికి నివేదిక పంపడం... స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తల సహకారం తీసుకోవడం లాంటి చర్యలు లేకపోవడంతో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయని చెప్పవచ్చు. ప్రధాన రహదారుల్లో మాత్రమే నిఘా నేత్రాలున్నాయి. కాలనీలలో, శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. పోలీస్ అధికారులు కేవలం ఆలయానికి వచ్చే ప్రముఖులకు స్వాగతం పలకడానికే పరిమితం కాకుండా నేరాలు జరగకుండా...జరిగినా వెంటనే గుర్తించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముక్కంటి కొలువైన పుణ్యక్షేత్రంలోని మూడో నేత్రం పనిచేసే విధంగా... ఉన్నతాధికారులు, నాయకులు నిఘా నేత్రాలను సరి చేయాల్సిన అవసరం ఉంది...