న్యూఢిల్లీ, జూలై 18, (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర విద్యాశాఖ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2025`26 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేసేందుకు సమాయాత్తమవుతోంది. ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలను మార్చిలో ఒకసారి, జూన్‌లో రెండోసారి నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మే నెలలో ఫలితాలను విడుదల చేశాక.. విద్యార్థులు తమ స్కోర్‌ను మెరుగుపరచుకోడానికి ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో ‘సప్లిమెంటరీ’ పరీక్షకు హాజరు అయ్యేందుకు అవకాశం ఇస్తున్నారు. మేలో ఫలితాలు వెలువడిన తర్వాత ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.కొత్త పరీక్షల విధివిధానాలను సిద్ధం చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ బోర్డును కోరింది. దీనిలో భాగంగా ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో ఇటీవల సీబీఎస్ఈ విస్తృత సంప్రదింపులు జరిపింది.
ఎప్పటిలాగే ఫిబ్రవరి`మార్చిలో 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్ష నిర్వహించాలని, ఆ తర్వాత జూన్‌లో మరోసారి అవకాశం ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ సిఫార్సులనే కేంద్ర విద్యాశాఖ దృష్టికి బోర్డు తీసుకెళ్లింది. కొత్త విధానం అమల్లోకి వస్తే.. మార్చిలో పరీక్షలు రాసిన విద్యార్థులు జూన్‌లో మరోసారి అన్ని పరీక్షలు రాసేందుకు వీలుంటుంది. ఇది పూర్తిగా విద్యార్థుల ఐచ్ఛికమే కానీ తప్పనిసరేం కాదట.ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నూతన విద్యా విధానంపై మాట్లాడుతూ.. విద్యార్థులకు 2025`26 అకడమిక్ సెషన్ నుంచి 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండుసార్లు హాజరు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది నూతన జాతీయ విద్యా విధానం, 2020 అమలులో భాగంగా అమలులోకి వస్తుంది. 21వ శతాబ్దపు లక్ష్యాలకు అనుగుణంగా దేశంలో విద్యా వ్యవస్థను పునరుద్ధరించడం లక్ష్యంగా ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. కొత్త విధానం విద్యార్థుల సృజనాత్మక సామర్థ్యాన్ని చేరుకోవడానికి నిర్మాణాత్మకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ 2023లో ‘న్యూ కరికులం ఫ్రేమ్‌వర్క్ (ఔఅఈ)’ పేరుతో ప్రకటించింది. దీని ద్వారా విద్యార్థులు స్కోర్ చేసిన ఉత్తమ మార్కును నిలుపుకోవడానికి అనుమతిస్తుంది. రెండోసారి పరీక్షలు రాసేవారు అన్ని పరీక్షలు కాకుండా తమకు మార్కులు తక్కువ వచ్చిన ఒకటో రెండో పరీక్షలు రాసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందట. దీనిపై త్వరలో కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.