హైదరాబాద్, జూన్ 21, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రాంతానికే తలమానికమైన సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీని కలుస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సింగరేణి బంద్ అయితే వేలాది మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తోందని ఈ విషయం గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామని తెలిపారు. ఖమ్మంలో గురువారం ఆయన విూడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సింగరేణి, బొగ్గు గనులపై బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. గనుల వేలం సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయంటూ మండిపడ్డారు.సింగరేణి సంస్థలో 42 వేల మంది రెగ్యూలర్, 26 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని భట్టి పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ ద్వారా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి తన ప్రాభవాన్ని కోల్పోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని కలిసి తెలంగాణ ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వారిని కలుపుకుని ప్రధాని మోదీని కలుస్తామన్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసే ప్రక్రియ మొదలు పెడుతుందని చెప్పారు. రేపు హైదరాబాద్ లో ఆక్షన్ జరగబోతుందన్నారు. ఏనాడు సింగరేణి ఉద్యోగులను పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తుందంటూ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. 40 బొగ్గు గనుల్లో ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి 2026కి పూర్తిగా పడిపోతుంది. 2031`32 వరకు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని సింగరేణి నిలబెట్టుకోవాలన్నా.. ఉద్యోగుల మనుగడ కొనసాగాలన్నా కేంద్రం నిర్వహించే గనుల ఆక్షన్ లో సింగరేణి యాజమాన్యం తప్పనిసరిగా కొత్త బొగ్గు గనులను సొంతం చేసుకోవాల్సిందేనన్నారు. లేని పక్షంలో సింగరేణి సంస్థ చరిత్రలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు.
అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీని కలుస్తాం !
గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటిని కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఇస్తే బాగుండేదన్నారు మంత్రి భట్టి విక్రమార్క. 2015లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మైన్స్ అండ్ మినరల్స్ డెవెలప్‌మెండ్ రెగ్యూలేషన్ యాక్ట్`1957 యాక్ట్‌లో సవరణ తీసుకొచ్చింది. దీని ద్వారా దేశంలో ఉన్న బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇవ్వకుండా.. వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేసిందని మంత్రి ఆరోపించారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవెలప్‌మెండ్ రెగ్యూలేషన్ యాక్ట్`1957 యాక్ట్‌లో సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆనాడు బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిందంటూ గుర్తు చేశారు. కేంద్రం పెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ పదేళ్లు సింగరేణిని కాపాడమంటున్నారు. తెలంగాణ విూద ప్రేమ ఉన్నట్లు బీజేపీ మంత్రులు మాట్లాడుతున్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామన్నారు