హైదరాబాద్, జూన్ 14, (ఇయ్యాల తెలంగాణ) : ఏపీలో బంపర్ మెజార్టీతో చారిత్రక విజయం నమోదు చేసింది టీడీపీ. ఈ సారి ఎన్నికల్లో పోటీచేయని టీడీపీ తెలంగాణలో దాదాపు మూతపడిరది. దాంతో ఇప్పుడు సైకిల్ పార్టీకి తెలంగాణంలో డిమాండ్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్లో చేరదామంటే అక్కడ తలుపులు తెరుచుకోని బీఆర్ఎస్ నేతలకు టీడీపీనే దిక్కులా కనిపిస్తుందంట. అలాంటి వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు. సైకిల్ ఎక్కేందుకు ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారంట.మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు దిగి సైకిల్ ఎక్కేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య నేతలతో రహస్య విూటింగ్ ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపారంట. ఆస్తుల రక్షణకు మల్లారెడ్డి తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపే ఆలోచనలో ఉన్నారంట. మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్తే ఆయనతో పాటుగా మరికొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.వ్యాపార వేత్తగా ఉన్న మల్లారెడ్డి 2014లో రాజకీయ ఆరంగేట్రం చేసి తెలుగుదేశం నుంచి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి.. ఏడాదిన్నరకే బీఆర్ఎస్ లో చేరారు. తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి.. కేసీఆర్ సర్కారులో ఇష్టారాజ్యంగా చక్రం తిప్పారు. పార్టీ మారినా టీడీపీ అధినేతతో చంద్రబాబునాయుడుతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంట ఆయన. 2024 శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా.. మేడ్చల్ నియోజవర్గం నుండి మల్లారెడ్డి గెలిచారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి వెళ్లేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. కర్ణాటక వెళ్లి డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్తో రాయబారాలు నడపాలని చూశారు. ఆ క్రమంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవగానే మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్ గిరి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక చేసేది ఏం లేక బిఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్టేట్మెంట్లు ఇచ్చి సైలెంట్ అయ్యారు.మొదట నుండి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయి అని విమర్శలు ఉండేవి. తాను మంత్రిగా ఉన్నంత కాలం ఒక్కటి బయటకు రాకుండా మేనేజ్ చేస్తూ.. కాలేజ్ చుట్టూ పక్కల భూములను కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
అధికారం కోల్పోయిన వెంటనే మల్లారెడ్డి అక్రమాలు అన్ని ఒక్కటిగా బయటకు వస్తుండడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు మల్లారెడ్డి.. ఇలాంటి సమయంలో మరెన్నో అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం లేక ఇటు బీజేపీలోకి పోలేక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.. టీ టీడీపీలో చేరి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని చూస్తున్నారంట.సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిన తరువాత మల్లారెడ్డి ఆయన అపాయింట్మెంట్ అడిగేందుకు సిద్ధం అయ్యారంట. ఒకవేళ చంద్రబాబునాయుడు కరుణించి మల్లారెడ్డి టి. టిడీపీలోకి వెళ్లే.. ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సైకిల్ సవారీకి రెడీగా ఉన్నట్లు గట్టిగానే వినిపిస్తుంది. తన ఆస్తులను కాపాడుకునేందుకే మల్లారెడ్డి టి. టీడీపీలోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉండటంతో.. టీడీపీలోకి వస్తే తన ఆస్తులకు ఎటువంటి హాని ఉండదని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారంట. ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం ఆయనకు అలవాటేగా.