కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, జూన్ 17 జూన్ 17 (ఇయ్యాల తెలంగాణ) : రియాసి ఉగ్రదాడి కేసు విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. ఈ ఉగ్ర దాడిపై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన కేసు ఇప్పటికే ఎన్ఐఏ నమోదు చేసిన విషయం విధితమే. ఈ ఉగ్ర దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని ఎన్ఐఏ భావిస్తుంది. ఆ క్రమంలో ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది.మరోవైపు ఈ దాడితో సంబంధముందని భావిస్తున్న 50 మంది అనుమానితులను భద్రతా దళాలతోపాటు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి.. ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ దాడిలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. నిందితులకు సంబంధించిన సమాచారం అందిస్తే రూ. 20 లక్షల రివార్డ్ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.జూన్ 9వ తేదీన జమ్ము కాశ్మీర్ రియాసీలోని శివ ఖోరి నుంచి కాట్రాకు భక్తులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. దీంతో డైవర్ వేగాన్ని పెంచడంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మరణించారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే ఈ ఘటన జరిగిన సమయంలోనే న్యూఢల్లీిలో రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ దాడిపై సమాచారం అందుకున్న ప్రధాని మోదీ.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు.ఇటీవల జమ్ము కాశ్మీర్లో వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆదివారం న్యూఢల్లీిలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఉగ్రవాద దాడులను అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు.అలాగే జూన్ 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దులతోపాటు నియంత్రణ రేఖ వద్ద భారీగా భద్రత దళాలను మోహరించాలని ఉన్నతాధికారులను అమిత్ షా ఆదేశించారు.