110కి చేరిన కేసులు..18 మంది అరెస్ట్
న్యూడిల్లీ, జూన్ 25, (ఇయ్యాల తెలంగాణ) : నీట్`యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కోసం తన బృందాలను పలు రాష్ట్రాలకు పంపింది. కాగా నీట్ పేపర్ లీకేజీ కేసులో బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఐదుగురిని అరెస్టు చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.పలు పోటీ పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేయడంపై విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకతవకలను గుర్తించిన తర్వాత బీహార్‌లోని పరీక్షా కేంద్రాల నుంచి 17 మంది విద్యార్థులను డీబార్ (తొలగింపు) చేసింది. ఈ వివాదం చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 110 మంది విద్యార్థులు ఇలాంటి చర్యలను ఎదుర్కొన్నారు.
నీట్ వ్యవహారంలో కీలక పరిణామాలు ఇవే
గ్రేస్ మార్కుల వివాదం కారణంగా నీట్ పరీక్షను తిరిగి రాయాలని సుప్రీం కోర్టు ఆదేశించగా 1,563 మంది విద్యార్థులకు గాను 813 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 5న పరీక్ష ప్రారంభం ఆలస్యం కావడంతో ఆరు కేంద్రాల్లో దీనికి పరిహారంగా ఆయా అభ్యర్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు ఇచ్చింది. హర్యానాలోని ఒకే కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులు 720 మార్కులు సాధించడానికి దోహదపడిరదని ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా నీట్`యూజీ పరీక్షలో 67 మంది విద్యార్థులు పూర్తి మార్కులు సాధించారు.
నీట్`యూజీ కేసులో సెక్షన్ 20`బి (నేరపూరిత కుట్ర), 420 (చీటింగ్) కింద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తమ పోలీసులు నమోదు చేసిన నీట్`యూజీ పేపర్ లీకేజీ కేసులను సీబీఐకి బదిలీ చేస్తూ బీహార్, గుజరాత్ ప్రభుత్వాలు ఆదివారం నోటిఫికేషన్లు జారీ చేశాయి.
జార్ఖండ్ లోని దియోఘర్ లో ఐదుగురిని పాట్నా పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. నిందితులంతా నలంద వాసులుగా గుర్తించారు. బల్దేవ్ కుమార్, ముఖేష్ కుమార్, పంకు కుమార్, రాజీవ్ కుమార్, పరవ్జిూత్ సింగ్‌లుగా వీరిని గుర్తించారు.
సంజీవ్ కుమార్ అలియాస్ లుతాన్ ముఖియా ముఠాకు చెందిన బల్దేవ్ కుమార్ నీట్`యూజీ పరీక్ష సమాధాన పత్రాన్ని పరీక్షకు ఒక రోజు ముందు తన మొబైల్ ఫోన్లో పీడీఎఫ్ ఫార్మాట్లో అందుకున్నాడు. పలుమార్లు ఇంటర్ స్టేట్ పేపర్ లీకేజీలకు పాల్పడిన ముఖియా ముఠా సభ్యులే ఈ ప్రశ్నాపత్రం లీక్‌కు మూలమని పోలీసులు పేర్కొన్నారు.
పాట్నాలోని రామ్ కృష్ణ నగర్‌లోని ఓ సేఫ్ హౌస్ లో మే 4న గుమిగూడిన విద్యార్థులకు బల్ దేవ్, అతని సహచరులు సమాధాన పత్రాన్ని ముద్రించారు. నీట్`యూజీ ప్రశ్నపత్రాన్ని జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో గల ఓ ప్రైవేటు పాఠశాల నుంచి ముఖియా ముఠా పొందింది.
పాట్నా సేఫ్ హౌస్ లో పాక్షికంగా కాలిపోయిన ప్రశ్నాపత్రాన్ని దర్యాప్తుబృందం కనుగొన్నది. లీకేజీ మూలాన్ని ధ్రువీకరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇచ్చిన రిఫరెన్స్ ప్రశ్నపత్రంతో వారు సరిపోల్చారు.
నీట్ పరీక్షలో అన్యాయమైన పద్ధతులను అవలంబించినందుకు బీహార్ లో 63 మంది విద్యార్థులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిషేధించింది. శనివారం గుజరాత్ లోని గోధ్రాకు చెందిన 30 మంది విద్యార్థులను బహిష్కరించింది. తాజాగా మరో 17 మందిని డీబార్ చేయడంతో మొత్తం కేసుల సంఖ్య 110కి చేరింది. తమకు అందిన సమాచారం మేరకు బిహార్‌లోని కేంద్రాల నుంచి హాజరైన 17 మంది అభ్యర్థులను డీబార్ చేశారు. దీంతో ఈ ఏడాది పరీక్ష నుంచి బహిష్కరణకు గురైన అభ్యర్థుల సంఖ్య 110కి చేరిందని ఎన్టీఏ అధికారి ఒకరు తెలిపారు.
అభ్యర్థులు, సంస్థల భాగస్వామ్యం, దళారులు కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, సాక్ష్యాలను నాశనం చేయడం సహా మొత్తం అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విద్యా మంత్రిత్వ శాఖ సిబిఐని కోరింది. ప్రభుత్వోద్యోగుల పాత్రపైనా ఆరా తీయనున్నారు.
పరీక్షల సంస్కరణలను సూచించడానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరును సవిూక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కానుంది. దీనికి ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు.