న్యూఢిల్లీ, జూన్ 15, (ఇయ్యాల తెలంగాణ) : హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జులై 22న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కాకుండా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కసరత్తులో భాగంగా నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన ‘ఓటాన్ అకౌంట్’ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇది ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వానికే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (ఃఏఖ) సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఔఆం) గెలుపొంది సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2014, 2019 మాదిరిగా బీజేపీకి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు. గత రెండు పర్యాయాలు తాము కోరుకున్న రీతిలో బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చిన మోదీ సర్కారు, త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై గుత్తాధిపత్యం కొనసాగిస్తుందా లేక మిత్రపక్షాల డిమాండ్లకు చోటిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
కొత్త ప్రభుత్వంలోనూ కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్‌ను కొనసాగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె ఇప్పటికే 6 పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ 7వది. బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడం, వారి ఆకాంక్షలను తెలుసుకుని తదనుగుణంగా బడ్జెట్ తయారుచేయడం ఆనవాయితీ. ఆ ప్రకారం రైతు సంఘాల నుంచి వ్యాపారవర్గాల వరకు అందరినీ కలుస్తుంటారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ మళ్లీ మొదలైంది. అయితే బడ్జెట్‌పై కోటి ఆశలతో ఎదురుచూసేది మాత్రం వేతన జీవులే. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన సొమ్ములో ఆదాయపు పన్ను రూపేణా కేంద్ర ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేయడంతో పాటు పరోక్షంగా అనేక రూపాల్లో పన్నుల దాడికి గురవుతుంటారు. వందలు, వేల కోట్లు ఆర్జించే వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో చాలా వరకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను ఎగవేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో సామాన్య వేతన జీవులు ప్రభుత్వం తమపై మోపుతున్న పన్ను భారాన్ని తగ్గిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్‌పై వేతన జీవులకు సదభిప్రాయం లేదు. ఈసారైనా తమపై కరుణచూపి పన్ను శ్లాబుల్లో మార్పుల రూపంలోనో.. లేక పన్ను మినహాయింపుల రూపంలోనో ఊరట కల్గిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే మాదిరిగా వ్యవసాయ, వ్యాపార, తయారీ రంగాలవారు కూడా ఈ బడ్జెట్ ద్వారా తమకు లభించే ప్రోత్సాహకాలు, పన్ను రాయితీల గురించి ఎదురు చూస్తుంటారు. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం వద్ద దండిగా నిధులుండాలి. ప్రభుత్వ గడిరచే ఆదాయంలో పన్నులు, సుంకాల రూపంలోనే ఎక్కువగా ఉంటుంది. పన్ను రేట్లు తగ్గిస్తే ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే అభివృద్ధి తగ్గుతుంది. కాబట్టి ఇదొక అంతులేని కథలా కొనసాగుతుంది.కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. ఈ ప్రత్యేక సమావేశాలు జూన్ 24న ప్రారంభమై జులై 3న ముగుస్తున్నాయి. తొలి రెండు రోజులు (జూన్ 24, 25) కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారంతోనే సరిపోతుంది. మొత్తం 543 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభలో సీనియర్ సభ్యుడిని రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల్లో మధ్యప్రదేశ్‌లోని తికంగఢ్ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన వీరేంద్ర కుమార్, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కొడిక్కుణ్ణిల్ సునీల్ సీనియర్ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ 8 పర్యాయాలు లోక్‌సభకు గెలుపొందారు.
అయితే వీరిలో వీరేంద్ర కుమార్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నందున కాంగ్రెస్ సభ్యుణ్ణి ప్రొటెం స్పీకర్‌గా తీసుకుంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నికల జరగనుంది. ఈ పదవి కోసం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి పేరు రేసులో వినిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఆమెకు చోటు కల్పించలేదు కాబట్టి ‘నారీశక్తి’ నినాదంలో భాగంగా ఆమెకు స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అనూహ్య నిర్ణయాలు తీసుకునే మోదీ`షా ద్వయం ఈసారి స్పీకర్‌గా ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.మరోవైపు లోక్‌సభతో పాటు రాజ్యసభ 264వ సెషన్ జూన్ 27 నుంచి ప్రారంభమవుతుంది. అంటే లోక్‌సభ తొలి రెండు రోజులు సభ్యుల ప్రమాణ స్వీకారం, మూడో రోజు స్పీకర్ ఎన్నిక పూర్తిచేసిన తర్వాత రాజ్యసభ మొదలవుతుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందని పార్లమెంట్ వర్గాలు వెల్లడిరచాయి. ప్రతియేటా బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే రాష్ట్రపతి ప్రసంగం ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రసంగం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేయదల్చుకుందో చెప్పే ప్రయత్నం చేస్తుంది.