ముస్లింల పవిత్ర హజ్ యాత్ర ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉష్ణతాపానికి హజ్ యాత్రికులు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడికి యాత్రికులు మృత్యువాత పడుతున్నారు. ఇక ఇప్పటి వరకూ 645 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడిరచాయి.
చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నట్లు చెప్పారు. ఈజిప్ట్, జోర్దాన్ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు కాగా, 90 మందికిపైగా జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు. అయితే, చనిపోయిన యాత్రికుల్లో దాదాపు 90 మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ దౌత్యాధికారి వెల్లడిరచినట్లు అంతర్జాతీయ విూడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే, భారతీయుల సంఖ్యపై సౌదీ అధికారులు గానీ, భారత ప్రభుత్వం గానీ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడిరచారు. మరో రెండు లక్షల మంది సౌదీ అరేబియా వాసులుగా పేర్కొన్నారు.
ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపశమనం కలిగించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన అల్`ముయిసెమ్ ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, గతేడాది హజ్ యాత్రలో 240 మంది యాత్రికులు చనిపోయారు. వారాలో చాలా మంది ఇండోనేషియాకు చెందిన వారే ఉన్నట్లు సౌదీ విూడియా తెలిపింది.