నల్గోండ, జూన్ 19, (ఇయ్యాల తెలంగాణ) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణ సేవను యాదగిరిగుట్ట దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షణకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట కొండపై జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు స్వయంభువులుగా వెలసిన పంచ నారసింహక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎన్నో ఏళ్లుగా స్థానిక భక్తులు మాత్రమే గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. అయితే 2016లో కోట్లాది రూపాయలతో ఆలయాన్ని పునఃర్నిర్మించారు. దీంతో గిరి ప్రదక్షణ చేసేందుకు భక్తులకు ఇబ్బందికరంగా మారింది. అరుణాచలంతోపాటు తెలుగు రాష్ట్రంలోని సింహాచలం, శ్రీకాళహస్తి, ఇంద్రకీలాద్రి క్షేత్రాల్లో మాత్రమే గిరిప్రదక్షిణలు కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామివారికి ఇప్పటివరకు స్థానిక భక్తులే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక నుంచి అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ అవకాశాన్ని కల్పించాలని యాదగిరిగుట్ట అధికారులు సంకల్పించారు. స్వామి వారి ఆలయం చుట్టూ ఐదున్నర కిలోవిూటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా వీధిని ఏర్పాటు చేశారు. పాంచ నర్సింహుడి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు నేడు నాలుగు వేల మందితో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ.. తిరిగి వైకుంఠ ద్వారం వద్దకు చేరుకొని మెట్ల మార్గంలో ఆలయానికి వెళ్లి ఉచితంగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
ఈ గిరి ప్రదక్షిణలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు, సిబ్బంది 5000 మంది భక్తులు పాల్గొన్నారు.గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కూడా గిరిప్రదక్షణతో ఆలయానికి మరింత శోభ వచ్చింది. అరుణాచలం గిరి ప్రదక్షిణ 14కిలోవిూటర్లు ఉండగా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఐదున్నర కిలోవిూటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణలో భక్తుల సంకీర్తనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయితే ‘’గిరి ప్రదక్షిణ’’ను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలవనుంది. క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు సేవలను అందుబాటులో తీసుకువచ్చే క్రమంలో భాగంగానే గిరి ప్రదక్షణకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. యాదాద్రి కొండపై భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గిరి ప్రదక్షణతో యాదాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందని వారు చెప్పారు.