Ticker

6/recent/ticker-posts

Ad Code

Old Cityలో మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు BJP కసరత్తు


పాతబస్తీ లో పట్టు కోసం
 
బీజేపీ ప్రయత్నం 

మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నం 

 బరిలోకి బీజేపీ అభ్యర్థిగా మాధవీలత

హైదరాబాద్‌ మార్చ్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) : నగరంలో పూర్వ వైభవం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానంలో మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్‌ మాధవీలతకు టికెట్‌ ఖరారు చేసింది. మజ్లిస్‌కు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్‌ఫాదర్‌ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలుత హైదరాబాద్‌ స్థానంలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలో నిలపాలని భావించినా ఆయన నిరాకరించారని సమాచారం. ఎన్‌సీసీ క్యాడెట్‌గా, క్లాసికల్‌ సింగర్‌గా మాధవీలత గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మాధవీలత రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్‌ విూడియాలో చురుగ్గా ఉంటున్నారు. గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు, పాలనా స్ఫూర్తితో బీజేపీలో చేరారు. కొంతకాలంగా పాతబస్తీ ప్రజలతో మమేకమై పేదలను ఆదుకుంటున్నారు. సామాజిక కార్యకర్తగా త్రిపుల్‌ తలాక్‌పై అనేక ముస్లిం మహిళా సంఘాలతో కలిసి పనిచేశారు. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై కౌంటర్‌గా ఇచ్చిన పలు ఇంటర్వ్యూలతో ఆమె పాపులర్‌ అయ్యారు. బీజేపీ ప్రతినిధిగా అసదుద్దీన్‌ విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించడంతో పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు.

25 ఏళ్లు సంతోష్‌నగర్‌లోనే..

మాధవీలత పాతబస్తీలోని ఓల్డ్‌ సంతోష్‌నగర్‌లో జన్మించారు. విద్యాదాయిని పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. నిజాం కాలేజీలో డిగ్రీ, కోఠి ఉమెన్స్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు. ఆమె పుట్టి పెరిగిందంతా ఓల్డ్‌ సంతోష్‌నగర్‌లోనే. 25 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారు. వివాహం అనంతరం భర్త కె.విశ్వనాథ్‌ (విరించి గ్రూప్‌ ఫౌండర్‌)తో కలిసి జూబ్లీహిల్స్‌కు వెళ్లిపోయారు. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రి చైర్‌పర్సన్‌ గా, లతా ఫౌండేషన్‌ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నారు. కాగా మాధవీలత ఎంపికపై పునరాలోచించాలని హైదరాబాద్‌ స్థానం కోసం ప్రయత్నాలు చేసిన బీజేపీ భాగ్యనగర్‌ జిల్లా నాయకులు అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు