హైదరాబాద్, డిసెంబర్ 23, (ఇయ్యాల తెలంగాణ) : పదో తరగతి, ఇంటర్మీడియట్లలో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు పైచదువుల్లో రానించలేకపోతున్నారు. దీంతొ ఇంజినీరింగ్‌లో చేరిన తొలి ఏడిదిలోనే ఫెయిలవుతున్నారు. ఇలా ప్రతీయేట ఇంజనీరింగ్‌లో వందల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించలేక చతికిల పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జేఎన్టీయూ హైదరాబాద్ అలాంటి విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోషన్ ఇచ్చేందుకు వీలుగా వినూత్న నిర్ణయం తీసుకుంది. మొదటి ఏడాది అకడమిక్ క్రెడిట్స్‌ను 75 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఉస్మానియా యూనిర్సిటీ అధికారులు కూడా ఈ విద్యా సంవత్సరానికి క్రెడిట్స్ వ్యవస్థనే పూర్తిగా తొలగించింది. అయితే ఇలా క్రెడిట్స్‌ను తగ్గించి విద్యార్థులకు ప్రమోషన్ ఇస్తున్నా మిగిలిన సెమిస్టర్లలో వారికి ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు.
పై కారణాలతోపాటు బోధనా ప్రమాణాలు తగ్గిపోవడం వల్ల ఫెయిలవుతున్న విద్యార్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. డిటెన్షన్ విధానంతో విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావం కలుగుతోందని చెబుతున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో క్రెడిట్స్ తగ్గింపు కేవలం ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమేనని అంటున్నారు. పాఠాలు అర్థం కావడంలేదని, ఫెయిలవుతున్నారని రెండో సంవత్సరానికి ప్రమోషన్ కోసం క్రెడిట్స్‌ను తగ్గించడం సరికాదని ఉస్మానియా మాజీ వీసీ ఎ.రామచంద్రం సూచిస్తున్నారు. బోధనా ప్రమాణాలు పెంచితేగానీ విద్యార్ధుల నైపుణ్యాలు మెరుగుపడవని అంటున్నారు.