జగిత్యాల నవంబర్ 8 (ఇయ్యాల తెలంగాణ ):దొర అహంకారాన్ని అణిచివేసేందుకు వస్తున్నా.. నన్ను సంపుకుంటారో..సాదుకుంటారో.. విూ ఇష్టం.. ఒక్కసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి..40 ఏళ్లుగా జరగని అభివృద్ధిని చేసి చూపిస్తా..అల్లరి’ మూకలను దూరం చేసి జగిత్యాలను శాంతికి నిలయంగా మారుస్తా..అని జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, జగిత్యాల బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ భోగ శ్రావణీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా తన నామినేషన్ ను దాఖలు చేశారు. జగిత్యాల పట్టణంలోని కృష్ణా నగర్ లో గల తమ నివాసం నుంచి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులతో కలిసి జగిత్యాల పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో ముందుగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కొత్త బస్టాండ్ వరకు వచ్చారు. అక్కడ నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తో కలిసి కొత్త బస్టాండ్ నుంచి టవర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రజలను అభ్యర్థించారు. అనంతరం జగిత్యాల బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ భోగ శ్రావణీ మాట్లాడుతూ రోజులు, వ్యక్తులు, విధానాలు మారుతున్నాయని, ప్రజలు కూడా జగిత్యాలలో మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని అన్నారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగాయి..
దేశంలో గతంలో జరిగిన ఉగ్రదాడుల్లో జగిత్యాలలో ఉగ్ర మూలాలు ఉండేవని, ఇప్పటివరకు పాలించిన వారే వారిని పెంచి పోషించారని అన్నారు. ఎన్‌ఐఏ సోదాలు కూడా జరిగాయని గుర్తు చేశారు. పీఎఫ్‌ఐ లాంటి ఉగ్రవాద సంస్థలను పెంచే పోషించలేదా అని ప్రశ్నించారు. స్థానిక పోలీసు సోదరులను, వారి కుటుంబ సభ్యులను కొంత మంది ఎంఐఎం మూకలు బెంబేలెత్తించి ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసారని అన్నారు. ఈ పాలకుల వల్ల పోలీసులకే న్యాయం జరిగినప్పుడు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని, ఈసారి ఎన్నికల్లో మార్పును చూస్తారని అన్నారు. జగిత్యాలను శాంతికి నిలయంగా మారుస్తానని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, ప్రజల కోసం తాను కలబడి, నిలబడి ఉంటానని పేర్కొన్నారు.బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకనే తాను పార్టీ వీడి ప్రజల్లోకి వచ్చానని, నన్ను సంపుకుంటారో లేక సాదుకుంటారో విూ ఇష్టమేనని అన్నారు.
జగిత్యాలకు 40 ఏళ్లుగా ఏం చేశారు..?
ఇప్పటివరకు 40 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ జగిత్యాలలో ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ 2014లో అనధికారంగా, 2018లో అధికారికంగా పనిచేసి రజకారుల పాలనను తలపించారన్నారు. మార్పు కోసం తాను వస్తున్నానని, వారిలాగా నేను డబ్బులు పంచలేనని, కానీ ప్రజల కన్నీళ్లు మాత్రం చూస్తానని, ప్రజల బిడ్డగా ఉంటానని అన్నారు. జగిత్యాల లో పేరుకే అభివృద్ధి అని, ఇన్ని రోజుల్లో ఎమ్మెల్యే చేసింది ఏవిూ లేదని అన్నారు. ఇప్పటివరకు జగిత్యాలలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ జరగలేదని, అభివృద్ధి అంతంత మాత్రమే జరిగిందని అన్నారు. తనని గెలిపిస్తే మామిడి మార్కెట్ ను అభివృద్ధి చేసి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకువస్తానని అన్నారు. ఇప్పటివరకు 20 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో అదే నాయకత్వం, అదే వ్యవస్థ ఉందని, ప్రస్తుతం 20 రోజులు తనతో నడవాలని, వచ్చే ఐదేళ్లు ప్రజలతో ఉంటానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గం వర్గాన్ని సువర్ణ అక్షరాలతో లిఖిస్తానని అన్నారు. జగిత్యాల నియోజకవర్గం ప్రజలు గల్లా ఎగరేసుకునే విధంగా పనిచేస్తానని అన్నారు. దొర అహంకారానికి బలై కన్నీటితో ఉన్నప్పుడు జగిత్యాల ప్రజలు తనను ఓదార్చరని గుర్తు చేశారు. ప్రస్తుతం దొర పాలనను అంతమొందించడానికి, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అందించడానికి తాను వస్తున్నానని, ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.