Ticker

6/recent/ticker-posts

Ad Code

ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన MLA, జిల్లా కలెక్టర్‌

పెద్దపల్లి అక్టోబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ): జిల్లాలో ఉన్న 549 ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. శుక్రవారం  పట్టణంలోని అమర్‌ నగర్‌ లోని ప్రభుత్వ అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలో  జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  విద్యార్థులకు స్వయంగా జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేలు టిఫిన్‌ వడ్డించి వారితో కలిసి టిఫిన్‌ చేశారు. టిఫిన్‌ నాణ్యత, రుచిపై కలెక్టర్‌ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నచ్చిన టిఫిన్‌ పెట్టాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ప్రతిరోజు పిల్లలు ఉదయమే పాఠశాలకు వచ్చి చేతులు మంచిగా శుభ్రం చేసుకొని అల్పాహారం స్వీకరించాలని కలెక్టర్‌ విద్యార్థులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించడం సంతోషకరమని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం జరుగుతుందని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు నచ్చిన టిఫిన్లను నాణ్యతతో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ మమతారెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి డి. మాధవి, అకడమిక్‌ కో ఆర్డినేటర్‌ పి.ఎం. షేక్‌, ప్రధానోపాధ్యా యులు, టీచర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు