కరీంనగర్, అక్టోబరు 19, (ఇయ్యాల తెలంగాణ );ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో పార్టీల నేతలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బిజీ అయిపోయారు. ప్రచారంలో దూకుడు పెంచడానికి పార్టీ జెండాలు, కండువాలు, బ్యానర్ల కోసం సిరిసిల్లకు క్యూకట్టారు. ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో..నేతన్నలు తయారు చేసే జెండాలకు డిమాండ్ ఏర్పడిరది. తెలంగాణ ఒక్కటే కాదు ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్ నుంచి చేనేతలకు ఫుల్ గా ఆర్డర్లు వస్తున్నాయి.వచ్చే నాలుగైదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిసా, అరుణాచల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల పార్టీలకు సంబంధించిన ఆర్డర్లూ వస్తున్నాయి. ఈ రకంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన తదితర పార్టీల ప్రచార సామగ్రి ఇప్పుడు అక్కడే తయారవుతోంది. ఒకే గూడు కింద తయారైన ప్రచార సామగ్రి రెడీ అవుతోంది. సిరిసిల్లలో 35 ఏళ్లుగా కాటన్, పాలిస్టర్ వస్త్రాలపై పార్టీల నినాదాలతో పాటు, ప్రచారపు జెండాలు, బ్యానర్లు తయారు చేస్తున్నారు. ఇక్కడ త్రివర్ణ పతాకాలు కూడా తయారవుతాయి. సిరిసిల్లలో తయారయ్యే జెండాలు, బ్యానర్లు తమిళనాడు, బిహార్, మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. జెండాలు, బ్యానర్ల తయారీతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కళకళలాడుతోంది. చేనేతలు, మహిళలకు పార్టీ జెండాలు, నేతలతో కూడిన జెండాల తయారీలో ఉపాధి లభిస్తోంది. సిరిసిల్లలోనే తయారైన పాలిస్టర్ బట్టను హైదరాబాద్‌లో ఆయా పార్టీల గుర్తులతో జెండాలు, బ్యానర్లు, కండువాలు ప్రింటింగ్ చేసి, సిరిసిల్లలో కటింగ్, కుట్టు పనులు చేస్తున్నారు. జెండాలు కుట్టడం ద్వారానే మహిళలు నెలకు రూ.4 వేల నుంచి రూ.5వేల దాకా సంపాదిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే జెండాలు వివిధ సైజుల్లో లభిస్తాయి. కండువాల ధరలు రూ.5 ఉంచి రూ.50 దాకా, చిన్న జెండాలు రూ.10, పెద్ద బ్యానర్లు రూ.80లకు తయారు చేస్తున్నారు. డిజిటల్ బ్యానర్లలో పెద్దవి రూ. 250లకు తయారు చేస్తున్నారు. తెలంగాణలోని కీలక పార్టీల నేతలందరూ సిరిసిల్లకు క్యూకడుతున్నారు. పార్టీల జెండాలు, కండువాలు, బ్యానర్లు ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు దయనీయంగా మారుతున్న పరిస్థితుల్లో మువ్వన్నెల జెండాలను తయారు చేసి ఉపాధి పొందుతున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా తమ వారసత్వ వృత్తిని కాపాడుకుంటున్న చేనేతలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో చేతి నిండి పని దొరికింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు రావడంతో చేనేతలు బిజీబిజీ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఉపయోగించే జెండాలు, కండువాలు, బ్యానర్ల తయారీలో నేతన్నలు, వారి కుటుంబసభ్యులు మునిగిపోయారు. చేతినిండా పనితో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల ప్రచార సామాగ్రి కోసం సిరిసిల్లకే ఆర్డర్లు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీ నుంచి సిరిసిల్ల నేతన్నలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి.
0 కామెంట్‌లు