Ticker

6/recent/ticker-posts

Ad Code

కాకర్లపల్లి గ్రామ దళితుల నిరసన

మంథని అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ ): అర్హులైన వారికి దళిత బంధు, గృహలక్ష్మి ఇవ్వాలని, దళిత వాడలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ  పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన దళితులు బుధవారం దళిత వాడలో నిరసన  కార్యక్రమాన్ని చేపట్టి తీవ్రంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్‌ మాట్లాడుతూ  కాకర్లపల్లి గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని అన్నారు.మంథని కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళితులు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వమిచ్చిన దళిత బంధు,గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో అవినీతి అక్రమాలు జరిగాయని ఈ గ్రామానికి తక్కువ యూనిట్లు కేటాయించి కాకర్లపల్లి గ్రామానికి ఈ ప్రాంత పాలకులు అన్యాయం చేశారని అన్నారు.బిఆరెస్‌ నాయకులకు బిఆరెస్‌ కండువా కప్పుకున్న వాళ్లకు నాయకులకు తొత్తులుగా ఉండే వాళ్లకు మాత్రమే ఈ పథకాలు వచ్చాయని నిరుపేదల నోట్ల మట్టి కొట్టారని విమర్శించారు.ఇండ్లు ఉన్న వారికే గృహలక్ష్మి ఇచ్చి ఇండ్లు లేని పేదలకు అన్యాయం చేశారని అన్నారు.మంథని నియోజకవర్గంలో లబ్ధిదారులు ఎంపిక అధికారులు కాకుండా టిఆర్‌ఎస్‌ నాయకులు ఎంపిక చేస్తూ పేద ప్రజానీకానికి అన్యాయం చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. అలాగే దళితవాడలో రెండు నెలలుగా వీధిలైట్లు లేక దళితులు చీకటిమయంలో మగ్గుతున్నారని కనీసం వీధిలైటు పెట్టకపోవడం సిగ్గుచేటని అర్హులైన వారికి పథకాలు అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంథని వెంకటి, గట్టయ్య, శంకర్‌, మంథని సాగర్‌,మంథని సమ్మయ్య,బూడిద శంకర్‌,బోసెల్లి మౌనిక, రాజమ్మ,శంకరమ్మ,హేమలత తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు