రంగారెడ్డి అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో అగర్వాల్ సమాజ్ పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్న అగర్వాల్ సమాజ్... సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో సైతం ముందంజలో ఉన్నారని గవర్నర్ కితాబిచ్చారు. నగర శివారులోని శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ లో గత రాత్రి తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహావీర్ అగ్రసేన్ జయంతి ఉత్సవాలు గవర్నర్ తమిళ్ సై తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.... తెలంగాణతో పాటు తమిళనాడులో సైతం అగర్వాల్ సమాజ్ తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. రక్తదానం నుండి మొదలుకొని అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అగర్వాల్ సమాజ్ చేస్తున్న కృషి ఎనలేనిదని గవర్నర్ తమిళ్ సై ప్రశంసలతో ముంచెత్తారు. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే మహావిరగ్రసైన్ జీవిత చరిత్రను నేటి యువతకు తెలియజేయాలని ఆమె సూచించారు.
దసరా నవరాత్రి వేడుకలు మహారాజశ్రీ అగ్రసేన్ జయంతి వేడుకలు ఒకేరోజు రావడం సంతోషమన్నారు గవర్నర్ తమిళ్ సై. ఈ సందర్భంగా తెలంగాణ అగర్వాల్ తో పాటు రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.
0 కామెంట్‌లు