Ticker

6/recent/ticker-posts

Ad Code

రాజాసింగ్‌ కౌంటర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 1, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లపై గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మహబూబ్‌ నగర్‌ పర్యటన సందర్భంగా రోడ్ల వెంబడి మోదీని విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు దమ్ముంటే ప్రధాని మోదీని కలవాలని సవాల్‌ విసిరారు. ప్రధాని ఆదివారం రాష్ట్రానికి వస్తున్నారని, ఆయన్ను కలసి 2014 నుంచి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్‌ అడగాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ఎంత నిధులు రావాలి? ఎంత ఇచ్చారు? ఇంకా ఎంత రావాలో అడగాలని రాజా సింగ్‌ సవాల్‌ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవకుండా నిధులు రాలేదంటూ చెప్పడం ఏంటని మండిపడ్డారు. మోదీని కలిసి రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ఎందుకు అడగటం లేదని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ముఖం చూపించే ధైర్యం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు లేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని రాజాసింగ్‌ మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా వాల్‌ పోస్టర్లు వేసి తెలంగాణ ప్రజల్లో అభాసుపాలు కావొద్దంటూ అంటూ హితబోధ చేశారు. రాష్ట్రంపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ప్రతిసారి అనడం సరికాదన్నారు. నిధుల గురించి మోదీని అడిగే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.గతంలో మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు ఇదే కేసీఆర్‌ ఆయనకు స్వాగతం పలికారని గుర్తు చేశారు. ప్రధాని గొప్పతనం గురించి మాట్లాడారని అన్నారు. కానీ ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా తప్పుడు  మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌కు దమ్ములేదని, ఎంఐఎం లాగా వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే అలవాటు ఉందన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఆలోచనల మాదిరి ప్రధాన మంత్రి ఆలోచన ఉండదన్నారు. చిన్న పిల్లాడు ప్రశ్నించినా సమాధానం చెప్పే గొప్ప వ్యక్తి మోదీ అన్నారు. తాను మరోసారి చెబుతున్నానని, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే నిధుల గురించి ప్రధానిని అడగాలని, సాయంగా వారి మంత్రులను కూడా తీసుకెళ్లవచ్చని వ్యంగ్యంగా అన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు