Ticker

6/recent/ticker-posts

Ad Code

ఆకస్మిక వరదలతో సిక్కిం అతలాకుత 14 మంది మృతి.. 102 మంది గల్లంతు


సిక్కిం అక్టోబర్‌ 5 (ఇయ్యాల తెలంగాణ ):ఆకస్మిక వరదలతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో లాచెన్‌ లోయలోని తీస్తా నది కి భారీగా వరద వచ్చి చేరడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది బేసిన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 102 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆకస్మిక వరదల కారణంగా సుమారు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 3,000 మంది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు సిక్కిం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విబి పాఠక్‌ తెలిపారు. చుంగ్‌థాంగ్‌లోని తీస్తా స్టేజ్‌ 111 ఆనకట్టలో పనిచేస్తున్న పలువురు కార్మికులు కూడా ఆనకట్ట సొరంగాల్లోనే చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో చుంగ్‌థాంగ్‌ డ్యామ్‌ నుంచి నీరు విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని, తీస్తా నదిలో నీటి మట్టం ఒక్కసారిగా 15`20 అడుగుల మేర పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వరదలు ప్రారంభమయ్యాయని వెల్లడిరచారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సిక్కిం ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది.వరదల తీవ్రతకు లాచెన్‌ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగాయి. సింగ్తమ్‌ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. అందులోని 22 మంది గల్లంతైనట్టు ఆర్మీ ఈస్ట్రన్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేకపోవడంతో అక్కడి ఆర్మీ సిబ్బందిని సంప్రదించడం కష్టంగా మారిందని సైనిక వర్గాలు తెలిపాయి.ఆకస్మిక వరదలతో తీస్తా నది బేసిన్‌లోని దిక్చు, సింగ్తమ్‌, రంగ్పో పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు నీటమునిగాయి. పశ్చిమబెంగాల్‌, సిక్కింను కలిపే 10వ నంబర్‌ జాతీయ రహదారి చాలా చోట్ల దెబ్బతింది. వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 14 వంతెనలు కూలిపోయాయి. మరోవైపు తీస్తా నది ప్రవహించే ఉత్తర బెంగాల్‌, బంగ్లాదేశ్‌లకు వరద హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. మంగన్‌, గ్యాంగ్‌టక్‌, పాక్యోంగ్‌, నామ్చి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు అక్టోబర్‌ 8 వరకు మూసివేయబడతాయని విద్యా శాఖ నోటిఫికేషన్‌ తెలిపింది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు