గాంధీనగర్, సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ):చిరకాల ప్రత్యర్థులైన భారత్ ` పాకిస్తాన్ క్రికెట్‌లో తలపడేదే అరుదు. ఫార్మాట్ ఏదైనా అభిమానులను మునివేళ్ల విూద కూర్చోబెట్టే ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఆ ఆశలు విూకు ఇంకా ఉంటే మాత్రం ఊళ్లో ఉన్న ఎకరమొ రెండెకరాల భూమినే పట్టణాల్లో అయితే ఏ ఫ్లాట్‌నో అమ్మకానికి పెట్టాల్సిందే. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మ్యాచ్ టికెట్ల రేట్లు కొండలు కాదు ఏకంగా హిమాలయాలే ఎక్కాయి. ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ. 56 లక్షలు పలుకుతోంది. కాస్త కనికరించిన వెబ్‌సైట్స్ అయితే రూ. 20 లక్షలు, రూ. 40 లక్షల్లో అమ్ముతున్నాయి. వాస్తవానికి ఐసీసీలో జరుగబోయే మ్యాచ్ టికెట్లు ప్రముఖ యాప్ ‘బుక్ మై షో’ ద్వారా బుక్ చేసుకోవచ్చు. భారత్ `పాక్ మ్యాచ్ కోసం బుక్ మై షో ఇదివరకే ఆగస్టు 29, ఈనెల 3న రెండు దఫాలుగా టికెట్లను విక్రయించింది. బుకింగ్ ఓపెన్ చేసిన గంటలోపే యాప్‌లో ‘సోల్డ్ అవుట్’ బోర్డు కనిపించింది. కానీ ఈ టికెట్లను దక్కించుకున్న కొంతమంది, ఇతర టికెట్ బుకింగ్ యాప్స్.. సెకండరీ మార్కెట్ దందా షురూ చేశాయి. వయాగొగో అనే టికెట్ బుకింగ్ యాప్‌లో భారత్ ` పాక్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గల అప్పర్ టైర్ టికెట్స్ రేట్లు రూ. 57 లక్షలుగా చూపించింది. ఇక సౌత్ ప్రీమియమ్ వెస్ట్ బే టికెట్ రేట్ రూ. 19.5 లక్షలుగా ఉంది. భారత్ ` పాక్ మ్యాచ్‌కే కాదు.. భారత్ ` ఆస్ట్రేలియా, భారత్ ` ఇంగ్లాండ్ మ్యాచ్‌కూ టికెట్ల రేట్లు ఒక్కో సైట్‌లో రూ. 3 నుంచి రూ. 10 లక్షల దాకా చూపించాయి. దీంతో సాధారణ అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు. పట్టపగలే నిలువుదోపిడీకి పాల్పడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. సెకండరీ మార్కెట్‌లో టికెట్ల రేట్ల ధరలు కొండెక్కడంతో క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐతో పాటు ఐసీసీలపై దుమ్మెత్తిపోస్తున్నారు. టికెట్ బుకింగ్ విషయంలో బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకుని ఐసీసీ పెద్ద తప్పు చేసిందని, అసలు భారత్ ` పాక్ మ్యాచ్‌కు బుక్ మై షో అమ్మిన టికెట్లు ఎన్నో లెక్కలు చెప్పాలని నిలదీస్తున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లక్ష మంది వీక్షించొచ్చు. సీటింగ్ కెపాజిటీ కూడా లక్షకు పైనే. మరి ఆ టికెట్లన్నీ ఎక్కడికి పోయినట్టు..? టికెట్ల బుకింగ్ డేట్స్ (ఆగస్టు 29, సెప్టెంబర్ 3) లోనూ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటలకు గంటలు వేయిట్ చేస్తేగానీ టికెట్స్ బుక్ అవ్వలేదు. అది కూడా వెయ్యి మంది చేస్తే ఇద్దరికో ముగ్గురికో టికెట్స్ బుక్ అయ్యాయి. మరి మిగిలిన టికెట్స్ అన్ని ఎక్కడికి పోయినట్టు..? దీనిపై బీసీసీఐ, ఐసీసీ దృష్టి సారించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు
0 కామెంట్‌లు