`నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (ఉపాధ్యయ దినోత్సవం)
వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి మహోన్నతుడు. పువ్వ పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుంచి అసాధారణ ప్రఙ్ఞా పాటవాలను ప్రదర్శించిన డాక్టర్ సర్వేపల్లి.. స్వశక్తితో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా, తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు. గురువులకే గురువుగా ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచారు ఆయన..సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888 జన్మించి? ఏప్రిల్ 17, 1975 మరణించారు. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో(చైనా, పాకిస్తానులతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.సర్వేపల్లి రాధాకృష్ణన్ 5`9`1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.విూల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము, విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.వీళ్లది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. ఆయన రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు.
రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్‌ఛాన్స్‌లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు.ఆయన రాసిన ‘ఇండియన్ ఫిలాసఫీ’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. ‘యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్’లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు రాధాకృష్ణన్.1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు.రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు.రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట.రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని ఆయన కోరారట. ఆరోజు నుంచే ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
0 కామెంట్‌లు