ఒంగోలు, సెప్టెంబర్ 12, (ఇయ్యాల తెలంగాణ ); పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. గుంటూరు కేంద్రంగా గుజరాత్‌కు రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్సు అధికారులు నాలుగు రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు ఇటీవల కాలంలో తనిఖీలు ముమ్మరం చేసి రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుంటున్నారు. కార్డులపై సరఫరా చేయాల్సిన బియ్యం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నా పౌరసరఫరా శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్సు ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా అధికారులు నిఘా పెట్టి రేషన్ బియ్యం నిల్వ కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. వినియోగదారులకు అందాల్సిన రేషన్‌ను కొంతమంది అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలించి కిలో రూ.30 నుంచి రూ.40కు చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. గురటూరు నుంచి కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవు ద్వారా ఇతర రాష్ట్రాలకు రేషన్ బియ్యం తరలిపోతుండగా ఇప్పటికే పలుమార్లు పోలీసులు, విజిలెన్సు అధికారులు వేర్వేరుగా వీటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. రేషన్ బియ్యం పంపిణీలో గత కొన్నేళ్లుగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంటింటికీ రేషన్ పథకం అమలు చేస్తున్నా ఈ అక్రమాలు ఆగడం లేదు. రేషన్ మాఫియా కొంతమందిని ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వివిధ మార్గాల్లో బియ్యం సేకరిస్తోంది. గత నెల రోజుల కాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విజిలెన్సు అధికారులు దాదాపు 200 టన్నుల వరకు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్సు అధికారులకు సమాచారం వచ్చి పట్టుకున్న సరుకు ఈ స్థాయిలో ఉండగా గుట్టుచప్పుడు కాకుండా వేలాది టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది. రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు కిలో రూ.20కు కొనుగోలు చేసి పాలిష్ పట్టి సాధారణ రకం, సోనామసూరిలో కలిపి విక్రయిస్తున్నారు. ఇటీవల బియ్యం ధరలు భారీగా పెరగడం వల్ల తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి కిలో రూ.44 నుంచి రూ.48 మధ్య విక్రయించే సోనామసూరి రకాల్లో కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. క్వింటాలుకు పది కిలోల రేషన్ బియ్యం కలిపినా తెలుసుకోని పరిస్థితి ఉంది. ఎక్కువగా రేషన్ బియ్యం కలిపిన మిల్లు యజమానులకు, వినియోగదారులకు మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి