ఫెడరేషన్‌కు అధ్యక్షుడి రాజీనామా :
స్పెయిన్ సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ) : మహిళల వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీ సమయంలో.. స్పెయిన్ క్రీడాకారిని జెన్ని హెర్మోసోకు ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్ రూబియేల్స్(లిప్ కిస్ ఇచ్చాడు. ఆ ఘటన పెను వివాదానికి దారి తీసింది. రూబియేల్స్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. పెదవిపై ముద్దాడిన ఘటన తనను బాధించినట్లు ఆ మహిళా ప్లేయర్ పేర్కొన్నది. కానీ సమాఖ్య నుంచి తప్పుకునేందుకు రూబియేల్స్ నిరాకరించారు. అయితే ఈ ఘటనపై స్పెయిన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు రూబియేల్స్ ప్రకటించారు. తాత్కాలిక అధ్యక్షుడు పెడ్రో రోచాకు తన రాజీనామాను అందజేసినట్లు ఆయన తెలిపారు.33 ఏళ్ల హెర్మోసోకు స్టేజ్‌పై లిప్ కిస్ ఇవ్వడం స్పెయిన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ దేశం వరల్డ్‌కప్ గెలిచినా.. దానికి గురించి పెద్దగా చర్చించిన సందర్భమే లేకుండా పోయింది. రాజీనామా చేయాలని ఎంత వత్తిడి తెచ్చినా రూబియేల్స్ పట్టించుకోలేదు. దీంతో ఆ లిప్ వివాదంపై హెర్మోస్ కోర్టును ఆశ్రయించారు. లీగల్ కేసును దాఖలు చేయడంతో.. తన పదవికి రాజీనామా చేసేందుకు చివరకు అతను అంగీకరించాడు. ఇష్టపూర్వకంగానే హెర్మోస్కు కిస్ ఇచ్చినట్లు రూబియేల్స్ పేర్కొన్నా.. అది తన అంగీకారం లేకుండా జరిగినట్లు ఆ క్రీడాకారిణి ఆరోపించారు.రూబియేల్స్ అధ్యక్షుడిగా ఉంటే.. తాము దేశం కోసం ఆడబోమని 23 మంది వరల్డ్ కప్ ప్లేయర్లతో పాటు మరో 81 మంది స్పెయిన్ క్రీడాకారిణిలు తెలిపారు.