Ticker

6/recent/ticker-posts

Ad Code

JANUARY 22న రామమందిరం ప్రారంభం

లక్నో, సెప్టెంబర్‌ 27, (ఇయ్యాల తెలంగాణ );అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ ఉండవచ్చని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్‌ పర్సన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఏ రోజు అయినా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, కచ్చితమైన తేదీని ప్రధాన మంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయలేదని నృపేంద్ర మిశ్రా వెల్లడిరచారు. ఈ భవ్య మందిరాన్ని మూడంతస్తుల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తి అవుతుందని నిర్మాణ కమిటీ ఛైర్‌ పర్సన్‌ తెలియజేశారు.అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణ పనులపై కమిటీ ఛైర్‌ పర్సన్‌ నృపేంద్ర మిశ్రా మాట్లాడారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ వర్క్‌ జరుగుతోందని, ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున గర్భాలయంలోని దేవతా విగ్రహాలపై సూర్య కిరణాలు ప్రసరించేలా దీన్ని డిజైన్‌ చేస్తున్నారని తెలియజేశారు. బెంగళూరులో శిఖర నిర్మాణం చేపడుతున్నామని, సైంటిస్ట్‌ లు పర్యవేక్షణలో డిజైన్‌ వర్క్‌ జరుగుతోందని చెప్పారు. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, పుణెలోని మరో ఇన్‌స్టిట్యూట్‌ కలిసి కంప్యూటరైజ్డ్‌ ప్రోగ్రామ్‌ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడిరచారు. 2024 జనవరి 15వ తేదీ అలాగే 24వ తేదీ జనవరి 2024 మధ్య శ్రీరామ చంద్రుడిని ప్రతిష్టించవచ్చని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ చివరి రోజున ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్నట్లు నృపేంద్ర మిశ్రా గతంలో తెలిపారు.గర్భగుడి ప్రధాన ద్వారం బంగారంతో కప్పబడి ఉంటుందని దానిపై బంగారు చెక్కడం ఉంటుందని నృపేంద్ర చెప్పారు. 161 అడుగుల ఎత్తైన ఆలయ శిఖరానికి కూడా బంగారు పూత పూయనున్నట్లు వివరించారు. ఆలయ శంకుస్థాపన జరిగినప్పుడే అయోధ్యకు వెళతానని ప్రధాని తన మనసులో అనుకున్నారని.. అందుకే 2021 ఆగస్టు 5న ఇక్కడికి వచ్చానని చెప్పారు.రాముడి విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామ మందిర ట్రస్ట్‌. దాదాపు ఆరడుగుల రాముడి విగ్రహాన్ని తయారు చేయించి...వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రతిష్ఠించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే..ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పించింది. నేపాల్‌ నుంచి రెండు సాలగ్రామ శిలలను తరలించారు. ఇప్పటికే ఇవి అయోధ్యకు చేరుకున్నాయి. రామ మందిర ప్రాంగణానికి చేరుకోగానే పూజారులు, స్థానికులు ఆ శిలలకు ఘనస్వాగతం పలికారు. పూలతో అలంకరించారు. పూజలు చేశారు. ఆ తరవాత ఆ శిలలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించారు. రాముడితో పాటు సీతా దేవి విగ్రహాన్నీఈ శిలతోనే తయారు చేయనున్నారు. గర్భాలయంలో ఈ రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నేపాల్‌లోని కలి గండకి నదీ తీరంలో ఈ శిలలను సేకరించారు. వీటిని సీతాజన్మ స్థలిగా భావించే జానక్‌పూర్‌ నుంచి ప్రత్యేక క్రేన్‌ల ద్వారా అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామ శిలల్లో ఒక దాని బరువు 18 టన్నులు కాగా...మరోటి 16 టన్నులు. విగ్రహ తయారీకి ఈ రెండు శిలలు అనువుగా ఉన్నట్టు అధికారులు నిర్ధరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు