హైదరాబాద్ సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ ): సైబర్ నేరాలు ..ఈ పదం ప్రస్తుతం ప్రజలకు కంటివిూద కునుకులేకుండా చేస్తోంది. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి, డబ్బులు కాజేస్తున్నారు. ప్రజలే కాకుండా.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే సైబర్ ఉచ్చులో చిక్కుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఈ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిత్యం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సైబర్ ఉచ్చులో చిక్కుకున్న వెంటనే 1930కి కాల్ చేయాలని సూచిస్తున్నారు.ఇందులో భాగంగానే సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 1930ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు పోలీసులు తాజాగా వినూత్న రీతిలో ప్రచారం చేపడుతున్నారు. రూ.500 నోటును పోలిఉన్న ఓ బ్రోచర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఆ బ్రోచర్ అచ్చం వ్యాలెట్లానే ఉంటుంది. దాన్ని చూడగానే అందులో రూ.500 నోటు ఉన్నట్లు బయటకు కనిపిస్తుంది. ఆ వ్యాలెట్‌ను రోడ్డుపై, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో పడేస్తున్నారు. దీంతో ప్రజలు దాన్ని చూడగానే అందులో రూ.500 నోటు ఉందని అనుకుని తమ చేతుల్లోకి తీసుకుంటారు. తెరచి చూస్తే మాత్రం అందులో డబ్బు ఉండదు. 1930కు కాల్ చేయాలన్న సమాచారం ఉంటుంది. అసలుకు, నకిలీకి మధ్య తేడాలను గుర్తించాలని, ఆశపడకుండా అప్రమత్తంగా ఉండాలనే సందేశం అందులో ఉంటుంది.
సైబర్ నేరాల అడ్డుకట్టకు.. సైబర్ నేరాలను అడ్డుకోవడంలో భాగంగా కేంద్రం 1930 టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఈ కాల్ సెంటర్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. అత్యాధునిక టెక్నాలజీ కలిగి, 30 మంది సిబ్బందితో 24/7 ఈ కాల్‌సెంటర్ పనిచేస్తోంది. ఈ సెంటర్‌కు వచ్చే కాల్స్‌ను మేనేజ్ చేసేందుకు ఎక్సోటెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చే కాల్స్ నేరుగా అక్కడ పనిచేసే సిబ్బందికి వెళ్తుంటాయి. ప్రతి రెండు నిమిషాలకు ఒక కాల్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు 5 నుంచి 10 నిమిషాలు కూడా మాట్లాడుతుంటారు. ఇలాంటి సమయంలో వచ్చే కొత్త కాల్స్.. సాఫ్ట్వేర్ సహాయంతో ఖాళీగా ఉన్న సిబ్బందికి వెళ్తుంటాయి.
బ్యాంకుల రిస్క్‌మేనేజ్‌మెంట్ టీమ్‌లతో.. ఈ కాల్ సెంటర్‌కు ఆయా బ్యాంకుల రిస్క్‌మేనేజ్‌మెంట్ టీమ్‌లు అనుసంధానమై ఉంటాయి. ఆయా బ్యాంకులు సైబర్‌నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, తమ వైపు నుంచి తక్షణ చర్యలు తీసుకునేందుకు రిస్క్‌మేనేజ్‌మెంట్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచాయి. దీంతో కాల్‌సెంటర్ నుంచి సమాచారం వెళ్లగానే.. ఆయా బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్స్ అప్రమత్తమై బ్యాంకు ఖాతాల ఆధారంగా డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని గుర్తించి, ఆ ఖాతాలను ప్రీజ్ చేస్తారు. నేరగాళ్లు ఆ ఖాతాల్లో నుంచి డబ్బు డ్రా చేయకుండా ఉంటే.. అందులో ఉండే నగదు కూడా ప్రీజ్ అవుతుందని పోలీసులు అధికారులు చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండండి.! సైబర్‌నేరగాళ్లు ఎదో ఆశ చూపి వల వేస్తుంటారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్లో మాట్లాడి.. ఏదైనా స్కీమ్ గురించి చెబితే వివరాలు తెలుసుకోవడం క్షేమమన్నారు. కనీసం తెలిసిన వ్యక్తులతోనైనా చర్చించాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో గూగుల్‌లో సెర్చ్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. సైబర్‌నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే.. వెంటనే సైబర్‌క్రైమ్ టోల్‌ప్రీ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.