
కృష్ణుడు అనగానే యాదవులు గుర్తుకొస్తారు. ఆ కులస్థులు కృష్ణుడిని కులదైవంగా కొలుస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యాదవులు అత్యధికులు కలిగిన గ్రామాల్లో కృష్ణాష్టమికి ఒకరోజు ముందు నుంచే ఈ వేడుకల్లో నిమగ్నమవుతారు. అర్ధరాత్రి నుంచి వేడుకలను ప్రారంభిస్తారు. కృష్ణాష్టమి రోజున వూయలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనులపండువగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. తమ చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ముగింపు ఘట్టంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్టుకూరు గ్రామంలో యాదవసంఘం ఆధ్వర్యంలో ఏటా కృష్ణాష్టమి రోజున ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆరోజున అంతా ఒకచోట చేరి కులదైవాన్ని కొలవడం. ఉట్టికొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలోని ఐక్యతను పెంచుతోంది. గ్రామాల్లోనూ వూరేగింపులు చేసి ఆలయాల వద్ద కుల పెద్ద చేత ఉట్టికొట్టిండం, సామూహిక భోజనాలు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో గ్రామాల్లోని ఇతర కులస్థులు సైతం పాలుపంచుకోవడం పండగకు మరింత వన్నె తీసుకొస్తోంది.
0 కామెంట్‌లు