నిజామబాబాద్, సెప్టెంబర్ 27 (ఇయ్యాల తెలంగాణ );నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. కోడ్ ఉల్లంఘన కేసులో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాటిని ఆయన తిరస్కరించారు. 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారని అభియోగం నమోదైంది. 2020లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్‌బుక్‌లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపి వేయాలనే నిబంధనను ఉల్లంఘించారనే ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నగరంలోని ఓ ప్రార్థనా స్థలం వద్ద ఉన్న ఆక్రమణల విషయమై ఎంపీ తన ఫేస్‌బుక్ ఖాతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు విషయమై అర్వింద్ తన ఫేస్‌బుక్ ఖాతాలోనే స్పందించారు. బ్యూరోక్రాట్‌ల విజ్ఞప్తి మేరకు ఈ పోస్టును తొలగించానని చెప్పారు. ఎల్లమ్మగుట్టలో కోడ్ ఉల్లంఘించి ప్రచారం చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంపీ అరవింద్‌కు నోటీసు ఇచ్చేందుకు మంగళవారం నగర పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంపీ అర్వింద్ అందుబాటులో లేరు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగర పర్యటనలో భాగంగా బస్వా గార్డెన్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన ఉన్నారనే సమాచారం మేరకు నాలుగో టౌన్ పోలీసులు అక్కడికి వెళ్లారు. నోటీసు విషయంపై ఎంపీతో చర్చించారు. నోటీసు తీసుకోవాలని పోలీసులు కోరగా అందుకు ఎంపీ అరవింద్ నిరాకరించారు. ఎన్నికలు ముగిసి దాదాపు నాలుగేళ్ల తర్వాత నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. పోలీసులు చేసేది లేక ఉన్నతాధికారుల సూచనతో వెనుదిరిగారు. కొద్దిరోజుల్లోనే ఈ నోటీసును ఆయన ఇంటి అడ్రస్‌కు పోస్టు ద్వారా లేదంటే అధికారిక మెయిల్ ఐడీకి పంపనున్నట్టు పోలీసులు తెలిపారు.తాజాగా పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు. ఎల్లమ్మగుట్టలో కోడ్ ఉల్లంఘనలు పాల్పడ్డారంటూ నోటీసులు జారీ చేశారు. ఇవ్వడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ కక్ష్య పూరిత చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.
0 కామెంట్‌లు