హైదరాబాద్, సెప్టెంబర్ 14, (ఇయ్యాల తెలంగాణ );హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని ఫ్రైఓవర్లు కట్టినా.. ఎన్ని స్కైవేలు నిర్మించినా.. రద్దీ మాత్రం తగ్గటం లేదు. సిగ్నళ్ల వద్ద కిలోవిూటర్ల మేర వాహనాలు బారులు తీరుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల రాకపోకల ఆధారంగా సిగ్నళ్లు మారే లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంపై దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతిక సిగ్నలింగ్ సిస్టంలో మరిన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇఔఅ) జియావుద్దీన్, ట్రాఫిక్ పోలీస్ అదనపు కమి షనర్ సుధీర్ బాబు, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మంగళవారం సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిస్టమ్ కంట్రోల్ (రుూఅ), పెలికాన్ సిగ్నళ్లు 404 ఉన్నాయి. ఏటీఎస్సీలో భాగంగా ప్రస్తుతం మూడు రకాలుగా సిగ్నళ్లు పని చేస్తున్నాయి. ఏ వైపు ఎన్ని సెకన్లు సిగ్నల్ వేయాలనేది (ఫిక్స్ మోడ్) ఒకటైతే.. వెహికల్ యాక్టివేటెడ్ కంట్రోల్ (పంఅ), మాన్యువల్ మోడల్లో సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తుంది. నగరంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని బట్టి పోలీసులు ఒక్కో మోడ్ వినియోగిస్తుంటారు.అయితే ఫిక్స్ మోడ్లో భాగంగా వాహనాల రాకపోకలతో సంబంధం లేకుండా నిర్ణీత సమయం రెడ్, గ్రీన్ సిగ్నళ్లు ఉంటాయి. ఒక్కో సారి ఆ మార్గంలో వాహనాల రద్దీ లేకపోయినా.. ఆ మార్గంలో గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. దీంతో ఇతర వైపులా ఉన్న వాహనదారులు తమకు గ్రీన్ స్నిగల్ పడే వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఇక నుంచి అలా వేచి చూడాల్సిన పని లేదు. వాహనాల రాకపోకల ఆధారంగా సిగ్నళ్లు మారే వీఏసీ మోడ్ వినియోగంపై దృష్టి సారించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంలో నిర్ణీత సమయం గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఆ మార్గంలో ఎలాంటి వెహికల్స్ రానిపక్షంలో ఆటోమేటిక్గా రెడ్ సిగ్నల్ పడుతుంది. ఆ వెంటనే మిగిలిన వైపు గ్రీన్ సిగ్నల్ పడుతుంది. దీంతో సిగ్నళ్ల వద్ద ఎక్కువ సేపు వేచి చూడకుండా వెళ్లిపోవచ్చు. ఈ విధానం ద్వారా జర్నీ సమయం తగ్గడంతోపాటు.. ప్రమాదాలకూ ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు.అదే విధంగా రోడ్డుదాటే పాదచారుల కోసం నగరంలో పెలికాన్ సిగ్నళ్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు.