నల్గోండ, సెప్టెంబర్ 11, (ఇయ్యాల తెలంగాణ ); ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ల ఖరారులో ఎంపీ కోమటిరెడ్డి అభిప్రాయం కీలకంగా మారింది . పార్టీ చేరికల్లోనూ ఆయన అనుమతి తప్పనిసరి అయిన వైనం కనబడుతోంది. ఫలితంగా జిల్లా రాజకీయం ఆయన చుట్టు తిరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ రాజకీయమంతా ఇపుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి ఎవరన్నా నాయకుడు కాంగ్రెస్ లో చేరాలన్నా.. అదే విధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లోనూ కోమటిరెడ్డి అభిప్రాయం కీలకంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, నియోజకవర్గాలు మినహా మిగిలిన ఎనిమిది చోట్లా ఆయన వేలు పెడుతున్నారు. తన అనుచరులకు, లేదా తన బాగా నమ్ముకున్న వారికి టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. చివరకు సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి ప్రభావంతో రాజకీయాలు నడిచే మిర్యాలగూడెం, దేవరకొండ నియోజకవర్గాల్లోనూ ఆయన సొంతంగా అభ్యర్ధులను సిద్ధం చేశారు. దీంతో ఇపుడు నల్లగొండ కాంగ్రెస్ రాజకీయం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చుట్టూ తిరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నల్లగొండ శాసన సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అయిదో సారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ మరుసటి ఏడాదే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కోమటిరెడ్డి భువనగిరి లోక్ సభా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వాస్తవానికి ఆ స్థానం నుంచి 2009 లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓటమి పాలై ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఎమ్మెల్సీగా పదవిలో ఉండగానే.. 2018 ఎన్నికల్లో ఆయన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 2019 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు లేని సయమంలో అప్పటికే నల్లగొండ అసెంబ్లీ స్థానంలో పరాజయం పాలైన ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి భువనగిరిపై పెత్తనం కోసం బాగానే రాజకీయ ఎత్తుగడలు వేశారు. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుచరుడు బీర్ల ఐలయ్య యాదవ్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు, భువనగిరి అసెంబ్లీ స్థానంలో రామాంజనేయులు గౌడ్, శివరాజ్ గౌడ్ అనే అనుచరులను పోటీ దారులుగా తయారు చేశారు. కానీ, అప్పటికే ఇక్కడ నుంచి డీసీసీ అధ్యక్షుడ కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పొగబెట్టారు. ఆయన టీపీసీసీ మాజీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గరి అనుచరుడు. అంతే కాకుండా 2018 ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. డీసీసీ అధ్యక్షునిగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పొసగక, పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్న జిట్టా బాక్రిష్ణారెడ్డికి ఇప్పటి వరకు పచ్చ జెండా ఊపలేదు. టీపీసీసీ నాయకత్వం ఏకగ్రీవంగా జిట్టాను పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నా.. కోమటిరెడ్డి అంగీకారం తెలపలేదన్న కారణంతో ఇంకా జిట్టాకు కండువా కప్పలేక పోతున్నారు. ఇక, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మారిన తర్వాత భువనగిరి డీసీసీ అధ్యక్షుని నియామకంలో తన పట్టు నిరూపించుకుని తాను అనుకున్న వ్యక్తికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారు.కేవలం భువనగిరి వరకే కోమటిరెడ్డి పరిమితం కాలేదు. ఇదే లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కోమటిరెడ్డి మాటే చెల్లుబాటు అవుతుంది. 2009 నుంచి ఆయన ఇక్కడి తన అనుచురిని టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి దగ్గరి అనుచరుడే. ఆయన 2014 ఓటమి పాలైనా.. 2018 లోనూ లింగయ్యే టికెట్ వచ్చేలా చక్రం తిప్పారు. ఆ ఎన్నికల్లో గెలిచిన లింగయ్య ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరడంతో ఇక్కడ కొత్త నాయకులను తయారు చేశారు. దైద రవీందర్ అనే నాయకుడికి ఎన్నికల్లో అవకాశం ఇప్పిస్తానని తన వెంట తిప్పుకున్నారు. రెండు మూడు నెలలుగా మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య తనయుడు వేదాసు శ్రీధర్ కూ అభయ హస్తం ఇచ్చి వెంట తిప్పుకుంటున్నారు. ఈ లోగా మారిన రాజీకీయ సవిూకరణాల్లో బీఆర్ఎస్ లో టిక్కెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లోకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నా.. కోమటిరెడ్డి పచ్చ జెండా ఊపని కారణంగానే ఇంకా ఆయన చేరిక డైలమాలో ఉందని చెబుతున్నారు.మరో వైపు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ కు దాదాపు టికెట్ ఖరారు అవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో కిషన్ నాయక్ అనే మరో నాయుడు పోటీ దారుగా తయారయ్యారు. కిషన్ నాయక్ కోమటిరెడ్డి ఆశీస్సులతోనే దేవరకొండలో రాజకీయాలు మొదలు పెట్టారని చెబుతున్నారు. ఇక, మిర్యాలగూడెంలో కుందూరు జానారెడ్డి తనయుడ కుందూరు రఘవీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కానీ, ఇక్కడా అడ్డం పడుతూ.. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్.ఆర్)కి అండగా నిలిచి గట్టి టికెట్ పోటీదారుగా ఆయనను తయారు చేశారు. ఇలా, మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలు పెడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చుట్టూనే ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయం నడుస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది
కోమటిరెడ్డి చుట్టూనే నల్గోండ జిల్లా
సోమవారం, సెప్టెంబర్ 11, 2023
0
Tags