Ticker

6/recent/ticker-posts

Ad Code

black market కు ఎరువుల అమ్మకాలు

కర్నూలు, సెప్టెంబర్‌ 12, (ఇయ్యాల తెలంగాణ ); విత్తు నుంచి పంట విక్రయాల వరకు రైతుల అన్ని లావాదేవీలూ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లోనేనని ప్రభుత్వం చెప్పగా, రైతులకు నష్టం చేస్తూ ఆర్‌బికెలలో గొలుసుకట్టు ఎరువుల వ్యాపారానికి ‘కొందరు’ తెర తీశారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఆర్‌బికెలకు సరఫరా అవుతున్న ఎరువులను అక్కడే రైతులకు విక్రయించాల్సి ఉండగా, స్టాక్‌ను ప్రైవేటు దుకాణాల డీలర్లకు గుండుగుత్తగా (బల్క్‌) అమ్ముకుంటున్నారు. ఆ విధంగా కొనుక్కున్న ఎరువులను డిమాండ్‌ బట్టి గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పి) కంటే అధిక ధరలకు డీలర్లు రైతులకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. ఒక చేత్తో ఆర్‌బికెలలో ఎరువుల అమ్మకాలు బాగా సాగుతున్నట్లు కలర్‌ ఇచ్చి, మరో చేత్తో డీలర్ల ద్వారా ‘నల్ల బజార్‌’ విరాజిల్లడానికి ‘కొందరు’ చేతులు కలుపుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇటువంటి చేతివాటాలు బయటపడటంతో అధికారులతో పాటు డీలర్ల అసోసియేషన్‌ అప్రమత్తమైంది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగించే వారిపట్ల అసోసియేషన్‌ కఠినంగా ఉంటుందని, అక్రమాలు నిలిపేయాలని బహిరంగంగా హెచ్చరించింది కూడా. కాగా ఇటువంటి అక్రమాలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయని సమాచారం.నాణ్యమైన ఎరువులను ఊరిలోనే రైతులకు అందుబాటులో ఉంచడం, ఎంఆర్‌పి అమలు, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టే ఉద్దేశంతో ఆర్‌బికెలు పని చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. నాలుగేళ్ల నుంచి ఆర్‌బికెలలో ఎరువులు అమ్ముతున్నారు. యూరియాకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆర్‌బికెలలో సేల్స్‌ తక్కువే. రైత్వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ప్రైవేటు దుకాణదారుల నుంచి అప్పు తీసుకొని పంటలొచ్చాక జమ వేసే ఆనవాయితీ ఉంది. ఆర్‌బికెలలో మొత్తం అమౌంట్‌ ముందే చెల్లించాలి. ఆ రీత్యా రైతులు డీలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్‌బికెలలో ఎంఆర్‌పి అమలు కావట్లేదు. రవాణా, హ్యాండ్లింగ్‌ పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు యూరియా 45 కిలోల బస్తా ఎంఆర్‌పి రూ.266.50 కాగా రూ.270 వసూలు చేస్తున్నారు. అందువల్ల కూడా రైతులు డీలర్ల వంక చూస్తున్నారు. నిరుడు ఆర్‌బికెలలో అన్ని ఎరువులూ కలిపి 3 లక్షల టన్నుల వరకు సేల్స్‌ చూపించగా ఈ ఏడాది పది లక్షల టన్నులు అమ్మాలని టార్గెట్‌ పెట్టారు. ఒక్కో ఆర్‌బికెలో కనీసం 5 టన్నుల నిల్వలుంచాలన్నారు. ఆ విధంగా ఆర్‌బికెలకు కేటాయించిన ఎరువులు కొన్ని మండలాలకు కలిపి నెలకొల్పిన హబ్‌ల వద్ద, ఆర్‌బికెల చెంత ప్రైవేటు డీలర్లకు అమ్ముకుంటున్నారు. ఎంఆర్‌పి, రవాణా, హ్యాండ్లింగ్‌పై కొంత వేసుకొని తరలిస్తున్నారు. ఆ విధంగా కొనుక్కున్న కొంత మంది డీలర్లు మరింత ధర కలుపుకొని, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు రైతులకు అమ్ముకుంటున్నారు. ఆర్‌బికెలలో స్టాక్‌ ఉంటే డిమాండ్‌ వేళ రైతులు అక్కడికెళ్లే అవకాశం ఉండేది. ఆర్‌బికెలలో స్టాక్‌ మార్కెట్‌కు చేరడంతో రైతులు అనివార్యంగా డీలర్లు చెప్పిన ధరకు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.డిబిటి (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) కోసం పక్కాగా ప్లాన్‌ వేశారు. వివిధ పథకాల కోసం ఆర్‌బికెలకు వచ్చే రైతుల నుంచి డిజిటల్‌ వేలిముద్రలు తీసుకొని, వాటి ద్వారా ఎరువుల అమ్మకాల డిబిటికి అత్యంత చాకచక్యంగా వాడుకుంటున్నారు. అందుకే వర్షాభావం వలన ఖరీఫ్‌లో సేద్యం జరగకపోయినా ఎంఆర్‌పి ఉల్లంఘనలు, బ్లాక్‌ మార్కెట్‌, కృత్రిమ కొరత చాలా చోట్ల నెలకొంది. ఇదిలా ఉండగా ఆర్‌బికెలలో ఎరువుల సేల్స్‌ పెంచాలని పైనుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో డీలర్లనుఆశ్రయిస్తున్నామన్నది కొందరి వాదన.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు