తిరుపతి,సెప్టెంబర్ 28 (ఇయ్యాల తెలంగాణ) : టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సతీసమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన సుప్రభాత సేవలో పాల్గొని వేంకటేశ్వర స్వామిని దర్శించుకన్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు గంభీర్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. అలాగే దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయాధికారులు గంభీర్ దంపతులను శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం బయటకు వచ్చిన గంభీర్ తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పలువురు అభిమానులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంభీర్ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు. ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ.. ఈ సారి వన్డే వరల్డ్‌కప్ గెలుచుకునేందుకు టీమిండియాకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.
140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో పాటు తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఈసారి భారత జట్టు ప్రపంచకప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఎక్స్‌పర్ట్ ప్యానల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో పాల్గొంటూ వివిధ జట్ల బలబలాలు, బలహీనతలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు. అక్టోబర్ 5 నుంచి ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ భారత్ వేదికగా ప్రారంభం కానుంది. ఈమెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు భారత్ చేరుకున్నాయి. శుక్రవారం (సెప్టెంబర్ 29) న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. గతేడాది ఫైనలిస్టులు ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌తో అసలు వరల్డ్ కప్ సమరం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
0 కామెంట్‌లు